మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక, బలనిరూపణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ జూలై 3,4 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ రోజు ఏక నాథ్ షిండే బలనిరూపణ పరీక్ష జరగనుంది. దీంతో ఈ రోజుతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.
షిండే ప్రభుత్వం సులభంగానే మెజారిటీని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. నిన్న స్పీకర్ ఎన్నిక సమయంలో షిండే, బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా 164 ఓట్లు లభించాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాహుల నర్వేకర్ స్పీకర్ గా ఎన్నికయ్యాడు. ఈయనకు వ్యతిరేకంగా 107 ఓట్లు వచ్చాయి. స్పీకర్ ఎన్నికతో షిండే ప్రభుత్వానికి 160కి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288 అయితే ఇందులో ఒక శాసన సభ్యుడు మరణించాడు. ప్రస్తుతం ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 144. కాగా.. బీజేపీకి స్వతహాగా 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో పాటు శివసేనలో షిండే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 17 మంది స్వతంత్రులు, ఎంఎన్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే మద్దతు ఉంది. దీంతో పాటు చిన్నాచితక పార్టీల మద్దతుతో 160కి ఫైగా ఎమ్మెల్యేలు షిండే, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు.
Read Also:Copenhagen: డెన్మార్క్ లో కాల్పులు.. ముగ్గురి మృతి
అనేక రాజకీయ ట్విస్టుల మధ్య సీఎం ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిష్టించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ కూటమికి వ్యతిరేకంగా శివసేనలో చీలిక తీసుకువచ్చి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. గౌహతి, గోవా ఇలా క్యాంపుల్లో ఉంటూ రాజకీయం చేశారు. చివరకు బీజేపీ మద్దతుతో సీఎంగా షిండే ఎన్నికయ్యారు. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు.
