మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే శివసేన నుంచి ఒక్కక్కరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గానికి జంప్ అవుతున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శుక్రవారం అర్థరాత్రి గుజరాత్ వడోదర కేంద్రంగా ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ‘ రాష్ట్రపతి పాలన’ విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రాత్రికే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా గవర్నర్ పోలీస్ శాఖతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితులు అదుపు తప్పకుండా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ముంబై నగరంలో 144 సీఆర్పీసీ సెక్షన్ను వచ్చే నెల 10 వరకు విధించారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం 15 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ సెక్యురిటీని ఏర్పాటు చేసింది.
అయితే బలనిరూపణ కోసం ఒక వేళ ఏక్ నాథ్ షిండే వర్గం ముంబైకి వచ్చినా.. శివసేన కార్యకర్తల నుంచి దాడులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే శివసైనికులు రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కార్యాలయాలు, ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్రంతో టచ్ లో ఉన్నారు. రాష్ట్రంలోని పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరిస్తున్నారు.
మహావికాస్ అఘాడీ కూటమిలో సభ్యులుగా ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్ నాథ్ షిండే వర్గం డిమాండ్ చేస్తోంది. మొత్తం 56 మంది శివసేన ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 39 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్నారు. మొత్తం 8 మంది మంత్రులు ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్నారు.
