ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. గత ఆదివారం నుంచి ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఊహించని రీతిలో భక్తులు తరలిరావడంతో దాదాపు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు గానీ.. వాహనాలు గానీ కదిలే పరిస్థితులు లేవు. ఇంకో వైపు ప్రయాగ్‌రాజ్‌లో ఆహార వస్తువులు నిండుకున్నాయి. అంతేకాకుండా అన్ని పెట్రోల్ బంకులోనూ ఇంధన కొరత ఏర్పడింది. వాహనాలు కదిలే పరిస్థితి లేక పెట్రోల్ ట్యాంకులు కదిలే పరిస్థితి లేదు.. అలాగే ఆహార వస్తువులు కూడా లోపలికి వచ్చే మార్గం లేదు. దీంతో స్థానిక ప్రజలతో పాటు కోట్లాదిగా తరలివచ్చిన భక్తులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక మూడు రోజుల నుంచి యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడమే లేదు. ఆయా రాష్ట్రాల బోర్డర్‌లోనే వాహనాలు నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ నియంత్రణ కావడానికి మరో మూడు రోజుల వరకు సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం యూపీలో పిండి, పప్పులు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులన్నీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక 50 పెట్రోల్ బంకులు వరకు మూసివేశారు. రవాణా సౌకర్యం మెరుగుపడ్డాకే.. పెట్రోల్ ట్యాంకులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వాహనదారులు ఇబ్బంది పడాల్సిందే. ఇక ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. భారీ ధరలతో అమ్ముతున్నారు. భక్తులు కూడా కొనే పరిస్థితులు లేవు. ఇక పాల ఉత్పత్తులు కూడా బాగా తగ్గిపోయాయి. ఇక పడవ సేవలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా కొన్ని గంటల పాటు పడవ సేవలు నిలిపివేశారు. దీంతో భక్తులు చాలా అసౌకర్యానికి గురయ్యారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. వాహనాల రాకపోకలు సులభతరం చేయడానికి.. భక్తుల రద్దీని నియంత్రించడానికి అదనపు పోలీసు బలగాలను మోహరింపజేస్తున్నామని డీజీపీ తెలిపారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.