CM Vijay: సీఎం విజయ్‌కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు

Cm Vijay

Cm Vijay

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ సాధించిన విజయం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

పిటిషన్‌లో విజయ్ ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించారని, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు. అలాగే నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో కొన్ని కీలక వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు, పిటిషనర్లకు పిటిషన్‌లో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేయాలని సూచించింది. అదే సమయంలో ఎన్నికల పిటిషన్‌పై వేగవంతంగా విచారణ జరపాలని నిర్ణయిస్తూ తదుపరి విచారణకు మార్గం సుగమం చేసింది. దీంతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.