TVK Vijay: టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్‌.. నోటీసులు జారీ..

Tvk Vijay

Tvk Vijay

TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాల వెల్లడిపై తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లలోని అంకెలు పొంతన లేకుండా ఉండటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైకి చెందిన విఘ్నేష్ అనే పిటిషనర్ దాఖలు చేసిన వివరాల ప్రకారం.. విజయ్ పెరంబూర్ నియోజకవర్గంలో 115.13 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. కానీ, తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఆస్తుల విలువను 220.15 కోట్లుగా చూపారు. ఈ రెండు అఫిడవిట్ల మధ్య ఉన్న 105 కోట్ల రూపాయల భారీ వ్యత్యాసంపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు.

Read Also: Dell 15 2026: ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, 15.6-అంగుళాల డిస్‌ప్లేతో.. డెల్ 15 2026 ల్యాప్‌టాప్ విడుదల

అయితే, మద్రాసు హైకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. ఒక నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా ఆస్తులను వెల్లడించకపోవడం తీవ్రమైన అక్రమం అని వ్యాఖ్యానించింది. దీనిపై విజయ్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, ఐటీ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్, సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ​పోలింగ్ తేదీ అయిన ఏప్రిల్ 23లోపే ఈ విచారణ నివేదికను ప్రజలకు వెల్లడించాలని, తద్వారా ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారని పిటిషనర్ కోరారు. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది. ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తుల దాపరికం రుజువైతే అది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.