NTV Telugu Site icon

Madhya Pradesh: గెలిచింది భార్యలు.. ప్రమాణస్వీకారం చేసింది భర్తలు

Madhya Pradesh

Madhya Pradesh

Husbands Replace Elected Wives At Panchayat Oath Ceremony: మహిళా సాధికారత అనేది రాజకీయాల్లో ఇప్పటికీ సాధ్యపడటం లేదు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇప్పటికీ భార్యలు గెలిచినా.. పెత్తనం అంతా భర్తలదే. తమకు రిజర్వేషన్ అనుకూలించకపోతే తల్లులను, భార్యలను నిలబెడుతున్నారు రాజకీయ నాయకులు. అధికారుల మీటింగుల దగ్గర నుంచి, అభివృద్ధి పనుల సమీక్ష వరకు అన్ని వీరే చేస్తుంటారు. ఎన్నికల్లో గెలిచినా మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారు. సాధారణంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే భార్యలు అన్న రీతిలో పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళ పరిస్థితి నెలకొంది. తాజాగా భార్యల తరుపున స్వయంగా ప్రమాణస్వీకారాలు చేసే పరిస్థితి కూడా నెలకొంది.

Read Also: Mother Cruelty: కసాయి తల్లి.. నాలుగో అంతస్థు నుంచి కూతుర్ని పడేసింది

ఇటీవల మధ్య ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే తాజాగా దమోహ్ జిల్లాలోని ఓ గ్రామపంచాయతీలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ స్థానంలో ఆమె భర్త ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశం అయింది. రాజకీయాల్లో మహిళల పాత్రను పరిమితం చేసే ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దామోహ్ జిల్లాలోని గైసాబాద్ పంచాయతీ పరిధిలో షెడ్యూల్ తరగతికి చెందిన ఓ మహిళ సర్పంచుగా గెలుపొందింది. మరికొంతమంది మహిళలు కూడా విజయం సాధించారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో మహిళలకు బదులుగా అంతా భర్తలే హాజరయ్యారు. అయితే భార్యల స్థానంలో భర్తలే ప్రమాణస్వీకారం చేయడానికి అధికారులే అనుమతించారనే ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ గవర్నమెంట్ సీరియస్ అయింది. వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. దామోహ్ పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తెలుస్తోందని.. విషయాన్ని పూర్తిగా విచారణ చేసి పంచాయతీ కార్యదర్శి దోషిగా తేలితే శిక్షిస్తామని అన్నారు.