Typewriters Museum: పాత టైప్‌రైటర్‌ల పట్ల తనకున్న ప్రేమను ప్రదర్శించడానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా 450 రకాల టైప్‌రైటర్‌లను సేకరించి రికార్డ్ సృష్టించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన రాజేష్ శర్మ ప్రపంచ వ్యాప్తంగా 450 రకాలైన టైప్ రైటర్లను సేకరించి ఓ మ్యూజియంగా మార్చేశాడు. అతడు సేకరించిన టైప్ రైటర్‌లలో ఎక్కువ శాతం అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా దేశాలవే ఉన్నాయి. 1960 -2000 సంవత్సరాల మధ్య వచ్చిన అన్ని రకాల టైప్ రైటర్లు ఈ మ్యూజియంలో అందుబాటులో ఉన్నాయి.
Read Also:Tamannaah Bouncers: రెచ్చిపోయిన బౌన్సర్.. మీడియాపై దాడి.. అసలేం జరిగింది?
కాగా పదేళ్ల క్రితం తాను ఈ మ్యూజియాన్ని ప్రారంభించినట్లు రాజేష్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యూజియంలో 1890 నాటి టైప్ రైటర్ కూడా ఉందని తెలిపాడు. తన తండ్రి మాధవ్ ప్రసాద్ శర్మకు ఇండోర్ జిల్లా కోర్టు వెలుపల ఒక దుకాణం ఉందని, అక్కడ తన తండ్రి టైపింగ్ పని చేసేవాడని వివరించాడు. నేటి తరానికి టైప్ రైటర్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పురాతన టైప్‌రైటర్లను ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించుకున్నట్లు రాజేష్ శర్మ పేర్కొన్నాడు. తాను సేకరించిన టైప్ రైటర్లలో 1890లోని అమెరికాకు చెందిన ఇంగ్లీష్ టైప్‌రైటర్ ఉందన్నాడు. అలాగే చాలా టైప్‌రైటర్‌లు 1910 నుండి 1930 మధ్య కాలానికి చెందినవి అని.. మెర్సిడెస్ కంపెనీ 1922లోనే టైప్‌రైటర్‌ను తయారు చేసిందని వివరించాడు. కరోనా కంపెనీ 1913 నుండి, రాయల్ కంపెనీ 1922 నుండి, ట్రాంప్ కంపెనీ 1960 నుంచి టైప్ రైటర్లను తయారుచేశాయన్నాడు. తన మ్యూజియంలో గోద్రెజ్, రెమింగ్టన్ టైప్ రైటర్లు కూడా ఉన్నాయన్నాడు. కరోనా కంపెనీ తయారు చేసిన టైప్‌రైటర్ ఆ సమయంలో పోలీసు అధికారులకు ఇష్టమైనదని, అది చిన్నగా, ఫోల్డబుల్‌గా ఉంటుందని.. ఈ టైప్ రైటర్ కేవలం 2.5 కిలోల బరువు మాత్రమే ఉంటుందని రాజేష్ చెప్పాడు.