Site icon NTV Telugu

డేంజర్‌గా మారుతోన్న డెల్టా ప్లస్‌ వేరియెంట్‌..!

Delta Plus variant

Delta Plus variant

కరోనాతో ఇప్పటికే అల్లాడిపోయిన దేశ ప్రజలను డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. మరింత భయపెడుతోంది. దేశంలో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌ కారణంగానే మూడో వేవ్‌ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది డెల్టా ప్లస్‌..! ఇప్పుడు ఏకంగా ప్రాణాలను బలి తీసుకుంటోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్‌ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. ఆమె రక్తనమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా.. ఆమెకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. ఎంపీలో ఇప్పటివరకు ఐదు కేసులు బయటపడ్డాయి. భోపాల్‌లో మూడు, ఉజ్జయినిలో రెండు కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు వైరస్‌ నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఈ రకం సోకిన వారిని గుర్తించి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టారు.

ఇప్పటివరకు దేశంలో 40కి పైగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 21 కేసులు బయటపడగా.. మధ్యప్రదేశ్‌, కేరళ, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాలకు ఈ వైరస్‌ పాకింది. ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. డెల్టాప్లస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అడ్వయిజరీ జారీ చేసింది. మరోవైపు.. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడలేదని ప్రకటించింది రాష్ట్ర వైద్యశాఖ…

Exit mobile version