Lumpi Skin Disease: గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల్లో 17 జిల్లాల్లో ఇప్పటివరకు 1,200లకు పైగా పశువులు లంపి చర్మవ్యాధితో చనిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తెలిసింది. ప్రభుత్వం చికిత్సతో పాటు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసిందని, అదే సమయంలో జంతు ప్రదర్శనలను కూడా నిషేధించిందని అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం వరకు వైరల్ వ్యాధి కారణంగా 1,240 పశువులు చనిపోయాయని, 5.74 లక్షల జంతువులకు టీకాలు వేసినట్లు రాష్ట్ర వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ మంత్రి రాఘవ్‌జీ పటేల్ తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 17 జిల్లాలకు వైరల్ ఇన్‌ఫెక్షన్ వ్యాపించిందని, వాటిలో ఎక్కువ శాతం సౌరాష్ట్ర ప్రాంతంలోనే ఉన్నాయని ఆయన చెప్పారు.
కచ్, జామ్‌నగర్, దేవ్‌భూమి ద్వారక, రాజ్‌కోట్, పోర్‌బందర్, మోర్బీ, సురేంద్రనగర్, అమ్రేలి, భావ్‌నగర్, బోటాడ్, జునాగఢ్, గిర్ సోమనాథ్, బనస్కాంత, పటాన్, సూరత్, ఆరావళి, పంచమహల్ జిల్లాలు ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయని వెల్లడించారు. వైరల్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పశువుల జాతర, జంతు ప్రదర్శనలు, పశువుల తరలింపును నిషేధిస్తూ జులై 26న నోటిఫికేషన్‌ను ప్రచురించిందని అధికారిక ప్రకటన తెలిపింది.
రాజ్‌కోట్ జిల్లా యంత్రాంగం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, తాలూకాలు, నగరాల నుండి పశువుల తరలింపును, పశువుల వ్యాపారం, పశువుల జాతరలు మొదలైన వాటిపై ఆగస్టు 21 వరకు నిషేధం విధించారు. కళేబరాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించిందని పేర్కొంది. ప్రభావిత జిల్లాల్లోని 1,746 గ్రామాల్లో 50,328 బాధిత పశువులకు చికిత్స అందించామని మంత్రి తెలిపారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ కచ్చితమైన పశువలు సంఖ్యను ప్రభుత్వం వెల్లడించలేదని ఆరోపించింది. పశువులను కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, వ్యాధి నియంత్రణ, పర్యవేక్షించడానికి ప్రతి బాధిత జిల్లాలో కలెక్టర్ల అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కమిటీల్లో స్థానిక పాలకమండలి అధికారులు, జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఛైర్మన్లు సభ్యులుగా ఉంటారని పేర్కొంది.
Salman Khan: గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు తుపాకీ లైసెన్స్
కనీసం 192 మంది వెటర్నరీ అధికారులు, 568 మంది లైవ్‌స్టాక్ ఇన్‌స్పెక్టర్లు ప్రభావిత జిల్లాల్లో ఇంటెన్సివ్ సర్వే, ట్రీట్‌మెంట్, టీకాలు వేసే పనిలో పాల్గొంటున్నారని మంత్రి పటేల్ చెప్పారు. వీటితోపాటు ప్రతి 10 గ్రామాలకు ఒక సంచార పశువైద్య వాహనంతోపాటు 298 మంది ఔట్‌సోర్సింగ్ పశువైద్యులను నియమించినట్లు తెలిపారు. కచ్, జామ్‌నగర్, దేవభూమి ద్వారకా, బనస్కాంత జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వెటర్నరీ కళాశాలలతో సంబంధం ఉన్న 107 మంది సభ్యులను యుద్ధప్రాతిపదికన చికిత్స, టీకాలు వేసేందుకు నియమించారు.
లంపి చర్మ వ్యాధి దోమలు, ఈగలు, పేనులు, కందిరీగలు మొదలైన వాటి ద్వారా లేదా ప్రత్యక్ష పరిచయం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపించే వైరల్ ఇన్‌ఫెక్షన్. ప్రధాన లక్షణాలు జంతువులలో సాధారణ జ్వరం, కళ్లు ముక్కు నుండి స్రావాలు, అధిక లాలాజలం, శరీరంపై నోడ్యూల్స్ వంటి మృదువైన పొక్కులు, పాల ఉత్పత్తి తగ్గడం, తినడానికి ఇబ్బంది, కొన్నిసార్లు జంతువులలో మరణానికి దారితీయవచ్చు.
Amit Shah and JP Nadda: బీహార్‌లో అమిత్‌షా.. పదేపదే తెలంగాణ ప్రస్తావన..! ఏంటి విషయం..?