Site icon NTV Telugu

Lucknow Name Change: త్వరలో లక్నో పేరు మార్పు… క్లూ ఇచ్చిన యోగీ ఆదిత్య నాథ్..!

Yogi Adityanath

Yogi Adityanath

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. గతంలో పలు పట్టణాలు, నగరాల పేర్లు మార్చిన విధంగానే రాజధాని లక్నో పేరును కూడా మార్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా యోగీ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సోమవారం సాయంత్రం లక్నోకు వచ్చిన ప్రధాని నరేంద్ మోదీని స్వాగతిస్తూ…‘‘ శేషావతారి భగవాన్ లక్ష్మణుడి పావన నగరమైన లక్నో మోదీకి స్వాగతం పలుకుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు యోగీ ఆదిత్యనాథ్.

దీంతో ఒక్కసారి లక్నో పేరు త్వరలోనే ‘లక్ష్మణ పురి’గా మారుతుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే లక్నోలో చాలా చోట్ల లక్ష్మణుడి ఆనవాళ్లు కనిపిస్తాయి. లక్నోలో ఇప్పటికే లక్ష్మణుడికి ఆలయం కడుతున్నారు. లక్నోలో ఇప్పటికే లక్ష్మణుడి పేరు మీద అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. లక్ష్మణ తిలా, లక్ష్మణ పురి, లక్ష్మణ్ పార్క్ ఉన్నాయి. దీంతో పాటు గతంలో పలు సార్లు బీజేపీ నాయకులు లక్నో పేరును ‘ లక్ష్మణ పురి లేదా లఖన్ పురిగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే యోగీ సర్కార్ లక్నో పేరును మారుస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే గతంలో ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని నగరాలు, పట్టణాల పేర్లను మార్చింది యోగీ సారథ్యంలోని బీజేపీ సర్కార్. అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా, ఫైజాబాద్ ను అయోధ్యగా మార్చింది. ప్రస్తుతం సుల్తాన్ పూర్ ను కుష్భవన్ పూర్ గా, అలీగఢ్ ను హరిగఢ్ గా, మెయిన్ పురిని మాయన్ పురిగా, సంభాల్ ను పృథ్వీరాజ్ నగర్ లేదా కల్కీ నగర్‌గా, ఫిరోజాబాద్‌ను చంద్రనగర్‌గా, దేవ్‌బంద్‌ను దేవ్‌రాంద్‌గా మార్చాలని డిమాండ్ లు ఉన్నాయి. గతంలో ఈ పేర్ల మార్పుపై రాజకీయంగా రచ్చ నడిచింది. సమాజ్ వాదీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ పేర్ల మార్పును వ్యతిరేఖించాయి. అయినా యోగీ సర్కార్ వెనక్కి తగ్గలేదు.

Exit mobile version