LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!

Lpg Gas Subsidy Cut

Lpg Gas Subsidy Cut

LPG Subsidy Cut: ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం మరో భారాన్ని మోపేందుకు రెడీ అవుతుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసే దిశగా చమురు కంపెనీలు కసరత్తు స్టార్ట్ చేశాయి. ముఖ్యంగా వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైబడి ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు.

ఎవరికి సబ్సిడీ రద్దు అవుతుందంటే..
ఆదాయపు పన్ను రిటర్నుల ఆధారంగా వినియోగదారుల ఆర్థిక పరిస్థితిని చమురు కంపెనీలు సమీక్షిస్తున్నాయి. ఎవరి కుటుంబ వార్షిక ఆదాయం అయితే రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందో, వారు ఇకపై గ్యాస్ సబ్సిడీని కోల్పోనున్నారు. ఐటీ రికార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా లబ్ధిదారులను సులభంగా గుర్తిస్తున్నారు. ఈ నిబంధన పరిధిలోకి వచ్చే వినియోగదారులకు ఇప్పటికే వారి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు చమురు కంపెనీల నుంచి మెసేజ్‌లు వెళ్లాయి. మీ ఆదాయం రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉందని, కాబట్టి సబ్సిడీ నిలిపివేస్తున్నామని ఆ మెసేజ్‌లలో గ్యాస్ కంపెనీలు పేర్కొంటున్నారు.

అభ్యంతరాలు తెలపడానికి ఛాన్స్
ఒకవేళ చమురు కంపెనీల నిర్ణయంతో ఏకీభవించని వారు లేదా తమ ఆదాయం పరిమితి రూ.10 లక్షల లోపే ఉందని భావించే వారు 7 రోజుల గడువులోగా స్పందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వినియోగదారులు సంబంధిత చమురు కంపెనీ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదులు చేయవచ్చు. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే, సబ్సిడీ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. లాస్ట్ మూడు నాలుగు ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వినియోగదారుడికి నేరుగా సబ్సిడీ అందడం లేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు (ఉదాహరణకు దీపం పథకం వంటివి) మాత్రమే కొన్ని వర్గాల వారికి అందుతున్నాయని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా చాలా మంది వినియోగదారులకు ఈ మెసేజ్‌లు రావడం వారిని అయోమయానికి గురి చేస్తుంది. భవిష్యత్తులో కొత్తగా సబ్సిడీని ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందేమోనని, అందుకే ఈ వడపోత ప్రక్రియ చేపట్టి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.