Traffic Jam Love Story: కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ జామ్ మాములుగా ఉండదు. అక్కడ పీక్ అవర్స్‌లో వాహనంపై బయటకు వెళ్లాలంటే గగనమే అని వాహనదారులు వాపోతుంటారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కారణంగా నరకం అనుభవిస్తుంటారు. అయితే అలాంటి ట్రాఫిక్ జామ్‌లో ఓ ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రేమకథ చోటు చేసుకుంది. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యే ఎజిపురా ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ జామ్ మధ్యలో సిగ్నల్ వద్ద సదరు లవ్‌స్టోరీ ప్రారంభమైంది. ఒక రోజు తన వాహనంపై తన స్నేహితురాలిని డ్రాప్ చేస్తున్న సమయంలో ఎజిపురా ఫ్లైఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. అయితే ఒకవైపు ఆలస్యం, మరోవైపు ఆకలి వేస్తుండటంతో తాము మరోదారిలో వెళ్లాల్సి వచ్చిందని ఓ వ్యక్తి వివరించాడు. ఈ సందర్భంగా ఆ మార్గంలో వెళ్తూ తామిద్దరం డిన్నర్ చేశామని.. అలా ఇద్దరం ప్రేమలో పడ్డామని తెలిపాడు.
సదరు మహిళతో తాను మూడేళ్లు డేటింగ్ చేశానని… రెండు సంవత్సరాల క్రితం వివాం చేసుకున్నానని రెడ్డిట్‌లో MaskedManiac92 అనే యూజర్ వివరించాడు. కానీ 2.5 కి.మీ. ఫ్లైఓవర్ ఇంకా నిర్మాణంలో ఉందని సదరు వ్యక్తి వెల్లడించాడు. దీంతో నెటిజన్‌లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉందని.. బాలీవుడ్ దీనిని బిగ్‌స్క్రీన్‌పైకి ఎక్కించాలంటూ కొందరు ఛమత్కరించారు. తాను బెంగళూరులో ఉన్నంత వరకు ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతూనే ఉంటుందని మరొకరు ఎద్దేవా చేశారు. తన కూతురు క్రైస్ట్ జూనియర్ కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు ఫ్లైఓవర్ వర్క్ ప్రారంభమైందని… ఇప్పుడు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయిందని.. పీజీలో చేరింది కానీ ఆ ఫ్లైఓవర్ మాత్రం ఇప్పటికీ అసంపూర్తిగానే ఉందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. మొత్తానికి ఆ వ్యక్తి ఎవరో వివరాలు సరిగ్గా తెలియకపోయినా అతడి లవ్‌స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో అందరినీ హృదయానికి హత్తుకుంటోంది.