NTV Telugu Site icon

Lord Shiva: తవ్వకాల్లో బయటపడ్డ కళ్యాణి చాళుక్యుల నాటి శివుని ఆలయం..

Nanded

Nanded

Lord Shiva: మహారాష్ట్రలో పురాతన శివుడి ఆలయం బయటపడింది. నాందేడ్ జిల్లాలోని హోట్టల్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో శివుడి ఆలయానికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. కళ్యాణి చాళుక్యుల నాటి ఆలయాలకు కేంద్రంగా ఉన్న హోట్టల్‌లో ఆలయంతో పాటు మూడు రాతి శాసనాలు లభించాయని అధికారులు వెల్లడించారు. క్రీ. శ. 1070 ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతల విరాళాలు ఈ శాసనాల్లో ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు కళ్యాణి చాళుక్యుల రాజధానిగా ఉన్న ఈ ప్రాంతం, అద్భుతమైన శిల్పాలకు, ఆలయాలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

Read Also: Rahul Gandhi: వారణాసి నుంచి ప్రియాంకా పోటీ చేసి ఉంటే, మోడీ ఓడిపోయేవారు..

ఈ చారిత్రాత్మక దేవాలయాలలో కొన్నింటిపై చేపడుతున్న పరిరక్షణ పనుల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్నప్పుడు పురావస్తు శాఖ అధికారులు ఆలయ స్థావరాన్ని కొనుగొన్నారు. నిర్మాణాన్ని నిర్ధారించేందుకు నాలుగు కందకాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. శివలింగంతో కూడిని ఆలయాన్ని వెలికితీశారు. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు వాడినట్లు రాష్ట్ర పురావస్తు శాఖ నాందేడ్ డివిజన్ ఇన్‌‌ఛార్జ్ అమోల్ గోటే తెలిపారు.

కళ్యాణి చాళుక్యులను పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు. తైలప-2 అనే రాష్ట్రకూట సామంత రాజు కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించినట్లు తెలుస్తోంది. 200 ఏళ్లకు పైగా వీరు పాలన సాగించారు. వీరి నుంచే స్వాతంత్ర్యం పొంది కాకతీయులు వరంగల్ కేంద్రంగా పాలన సాగించారు. వీరు కర్ణాటక, మహారాష్ట్ర దక్షిణ భాగాన సామ్రాజ్యాన్ని విస్తరించారు.