Site icon NTV Telugu

Acute Hepatitis: చిన్నారుల‌కు పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణాలు.. 700 మందికి హెప‌టైటిస్‌

Kids

Kids

కరోనా తగ్గుముఖం పడుతుందన్న సమయంలో.. చిన్నారులను పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్ల‌లు అక్యూట్ హెప‌టైటిస్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. ఈ వ్యాధితో ప‌దిమంది పిల్ల‌లు ప్రాణాలుకూడా కోల్పోయారు.

ఈ అక్యూట్ హెప‌టైటిస్‌కు సంబంధించిన మొద‌టికేసు యూకేలో మొద‌టిసారి బ‌య‌ట‌ప‌డింది. ఈ ప్ర‌మాద‌క‌ర‌ కాలేయ వ్యాధికి కార‌ణం అంతుచిక్క‌డం లేదు. సాధార‌ణంగా హెప‌టైటిస్‌కు హెప‌టైటిస్- ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు వైర‌స్‌లు కార‌ణ‌మ‌వుతాయి. కానీ ఈ అక్యూట్ హెప‌టైటిస్ కేసుల్లో ఈ వైర‌స్‌లు క‌నిపించ‌లేదు. దీంతో ఇది పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణ‌మ‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు.

ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ విశ్వ‌విద్యాల‌య ప‌రిశోధ‌కులు తేలిక‌పాటి కొవిడ్ -19నుంచి కోలుకున్న ఐదుగురు చిన్నారుల‌పై అధ్య‌య‌నం నిర్వ‌హించారు. వీరిపై రెండు ర‌కాల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేశారు. ఇందులో 3,5 నెల‌ల వ‌య‌స్సుగ‌ల ఇద్ద‌రు చిన్నారులు తీవ్ర‌మైన కాలేయ సంబంధ వ్యాధి (అక్యూట్ హెప‌టైటిస్‌)తో బాధ‌ప‌డుతున్న‌ట్లు గుర్తించారు.

కొవిడ్ కంటే ముందు వీరిద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్నార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం వీళ్ల‌కు కాలేయ మార్పిడి చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. మిగిలిన ముగ్గురు పిల్ల‌ల్లో 8, 13 ఏళ్ల వ‌య‌స్సుగ‌ల ఇద్ద‌రు కొలెస్టాసిస్ హెప‌టైటిస్ అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు క‌నుగొన్నారు. వారికి స్టెరాయిడ్స్ ఇవ్వ‌గా కాలేయ ఎంజైమ్స్ మెరుగుప‌డ్డాయ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ఈ ప‌రిశోధ‌నా ఫ‌లితాలు జర్నల్ ఆఫ్ పిడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ న్యూట్రిషన్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

High Court: సోమేష్ కుమార్ కొనసాగింపుపై హైకోర్టులో ప్రభుత్వ వాదన

Exit mobile version