NTV Telugu Site icon

Lok sabha: కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీల టీ-షర్టులపై రాతలు.. స్పీకర్ అభ్యంతరం

Loksabhadmk

Loksabhadmk

గత కొద్ది రోజులుగా కేంద్రం-తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వార్ నడుస్తోంది. హిందీ, డీలిమిటేషన్‌పై డీఎంకే పోరాటం చేస్తోంది. ఈ ఉద్యమాన్ని డీఎంకే జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తోంది. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తోంది. తాజాగా కేంద్రానికి వ్యతిరేకంగా టీ-షర్టులపై రాసిన రాతలతో సభలో గందరగోళం సృష్టించారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు పోరాటం చేస్తోందని.. అంతిమంగా తమిళనాడుదే విజయం అంటూ టీ-షర్టుపై పేర్కొన్నారు.

అయితే డీఎంకే సభ్యుల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి నినాదాలతో సభకు రావడం భావ్యంకాదని హెచ్చరించారు. ఇలాంటి విధానాలు పార్లమెంటరీ నియమాలు, మర్యాదలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి పద్ధతి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని సూచించారు. సభ్యులు సభా గౌరవాన్ని కాపాడాలన్నారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ నియమాలను ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. సరైన దుస్తులు ధరించాలని హితవు పలికారు. అనంతరం సభను స్పీకర్ వాయిదా వేశారు.

‘‘న్యాయమైన డీలిమిటేషన్, తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది’’ అని డీఎంకే ఎంపీల షర్టులపై రాతలు రాసి ఉన్నాయి. డీఎంకే ఎంపీ శివ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు న్యాయమైన డీలిమిటేషన్ కోసం పట్టుబడుతోంది. దీని వల్ల దాదాపు 7 రాష్ట్రాలు ప్రభావితమవుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. అందుకే న్యాయమైన డీలిమిటేషన్ డిమాండ్ చేస్తూ మేము మా నిరసనను కొనసాగిస్తున్నాము” అని అన్నారు.