Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ స్పీడ్‌ని పెంచాయి. ఏ క్షణానైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మార్చి 13 తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఎలక్షన్ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని, అది పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వర్గాలు శుక్రవారం తెలిపాయి.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. మార్చి 13 లోపు రాష్ట్రాల పర్యటన పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులు ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల అధికారులతో క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఈవీఎంల తరలింపు, భద్రతా బలగాల అవసరం, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
ముఖ్యంగా, ఈ సారి ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్స్‌లో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. మే నెలలో ఎంపీ ఎన్నిలకు జరిగే అవకాశం ఉంది. దేశం మొత్తం 96.88 కోట్ల మంది ప్రజలు ఓటేసేందుకు అర్హులుగా ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్ల సంఖ్య.
