SHANTI Bill: ‘‘అణు రంగం’’లోకి ప్రైవేట్ సంస్థల్ని అనుమతించడానికి కేంద్రం తీసుకువచ్చిన ‘‘శాంతి బిల్లు’’కు లోక్‌సభ ఈ రోజు(బుధవారం) ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ బిల్లు 2047 నాటికి 100 గిగా వాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇంత వరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలకు అనుమతి లభించనుంది. ప్రైవేట్ భాగస్వామ్యం కోసం సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (శాంతి) బిల్లును, ప్రతిపక్షాల వాకౌంట్ మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు.
Read Also: Pakistan: భారత విమానాలకు పాక్ గగనతలం నిషేధం పొడగింపు..
ఈ బిల్లును దేశ అభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశంగా చేసే ఒక ‘‘మైల్ స్టోన్’’ చట్టంగా మంత్రి అభివర్ణించారు. ‘‘భౌగోళిక రాజకీయాల్లో భారతదేశ పాత్ర పెరుగుతోంది. మనం ప్రపంచ శక్తిగా ఎదగాలంటే, ప్రపంచ ప్రమాణాలు, ప్రపంచ వ్యూహాలను అనుసరించాలి. ప్రపంచం స్వచ్ఛమైన శక్తి వైపు పయనిస్తోంది. మేము కూడా 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని ఆయన అన్నారు. మరోవైపు, ఈ బిల్లు పౌర అణు నష్ట పరిహార చట్టం-2010లోని నిబంధనల్ని నీరుగారుస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ చట్టం అణు ప్రమాదానికి సంబంధించిన బాధ్యతను అణు పరికరాల సరఫరాదారులపై మోపుతుంది.
