NTV Telugu Site icon

Railway Warning: రీల్స్ చేసే వారిపై రైల్వే బోర్డు కొరడా.. ఇకపై ఇలా చేస్తే..!

Reelsonrailwaystation

Reelsonrailwaystation

సోషల్ మీడియా మోజులో పడి యువత ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఫేమస్ కోసమో.. లేదంటే వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఇల్లు, బడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ.. ఇష్టానురీతిగా పబ్లిక్‌కి ఇబ్బంది కలిగించే విధంగా రీల్స్ చేస్తూ విసుగు పుట్టిస్తున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు.. చివరికి ఎయిర్‌పోర్టులు.. విమానాలను వదలకుండా వీడియోలు చేస్తూ సభ్యత మరుస్తున్నారు. దీంతో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే ప్రాంగణాల్లో గానీ.. రైల్లో గానీ రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రైల్వే ట్రాక్‌లు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే లేదా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది.

రైల్వే బోర్డ్ సూచనల ప్రకారం.. ప్రజలు, ప్రధానంగా యువకులు, రైల్వే ట్రాక్‌లపై మరియు కదులుతున్న రైళ్లలో తమ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి స్టంట్ వీడియోలను చిత్రీకరిస్తున్నారు. రైలు భద్రతపై చూసిచూడనట్లు రాజీపడింది. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితులు మరింత శృతిమించడంతో చర్యలకు ఉపక్రమించింది. రీల్స్‌ చేసే వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్‌లను ఆదేశించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

‘‘రీల్స్ చేసే వారు అన్ని పరిమితులను దాటారు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా, ట్రాక్‌లపై వస్తువులను ఉంచడం, ట్రాక్‌లపై వాహనాలను నడపడం లేదా కదులుతున్న రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేయడం ద్వారా వందలాది మంది రైలు ప్రయాణీకుల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తారు.’’ అని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్లలోనూ.. రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు రైలు సమీపంగా సెల్ఫీలు తీసుకుంటూ చనిపోతున్నారు. మరికొందరు ట్రాక్‌లపైకి వాహనాలు రప్పించి స్టంట్లు చేస్తున్నారు. ఇలా రైల్వే భద్రతకు ముప్పు తెస్తున్నట్లు గుర్తించడంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.