LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్‌కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ

Lk Advani

Lk Advani

LK Advani Enters 100th Year: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 99వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఆదివారం (నవంబర్ 8)తో 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన అద్వానీ రాజకీయ ప్రస్థానం, దేశానికి ఆయన చేసిన సేవలను మోడీ కొనియాడారు. బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, తరతరాల పార్టీ కార్యకర్తలను ఆయన తీర్చిదిద్దారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ అద్వానీ రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను గుర్తుచేసుకుంటూ ప్రత్యేక వ్యాసం రాశారు. దేశ విభజన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు, ఎమర్జెన్సీ, చారిత్రాత్మక రామ రథయాత్ర, జనసంఘ్ నుంచి బీజేపీ నిర్మాణం వరకు ఆయన చేసిన కృషిని ప్రస్తావించారు. భారతదేశానికి అద్వానీ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

దేశమే ప్రథమం అనే సిద్ధాంతానికి పునాది వేశారు

ప్రధాని మోడీ తన వ్యాసాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు. 1947లో చిన్న వయసులోనే దేశ విభజన కారణంగా సింధ్‌లోని తన స్వస్థలాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిన అద్వానీ.. ఎలాంటి ద్వేషం, బాధను మనసులో పెట్టుకోకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అదే పట్టుదలతో జనసంఘ్‌ను బలోపేతం చేసి, భారతీయ జనతా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని మోడీ పేర్కొన్నారు.

1989లో కాంగ్రెస్ పార్టీ బలం 400కు పైగా స్థానాల నుంచి 200 కంటే దిగువకు పడిపోయిన రాజకీయ పరిణామాలను, 1996లో బీజేపీ తొలిసారిగా లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించడాన్ని మోడీ ప్రస్తావించారు. బీజేపీ అధ్యక్షుడిగా అద్వానీ పనిచేసిన కాలంలో పార్టీ గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. దేశమే ప్రథమం అనే సిద్ధాంతంతో పార్టీకి బలమైన పునాది వేయడంతో పాటు, అనేక తరాల కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారని ప్రశంసించారు. అద్వానీలో రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని మోడీ పేర్కొన్నారు. మొదటిది సిద్ధాంతాల పట్ల స్పష్టత, మేధోపరమైన చురుకుదనం కాగా.. రెండోది భారత రాజకీయాల్లోని ఒక వర్గం ప్రచారం చేసిన నకిలీ లౌకికవాదాన్ని ప్రశ్నించే ధైర్యమని వివరించారు.

వాజ్‌పేయితో కలిసి భారత రాజకీయాల్లో కీలక మార్పులు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్‌గా రాజస్థాన్‌లో పనిచేసిన అద్వానీ.. అనంతరం ఢిల్లీకి వచ్చి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి పనిచేశారు. దశాబ్దాల పాటు ఇద్దరు అగ్రనేతలు పోటీ భావన లేకుండా పరస్పర సహకారంతో పనిచేయడం అరుదైన విషయమని మోడీ పేర్కొన్నారు. అద్వానీ, వాజ్‌పేయి కలిసి భారత రాజకీయాల గమనాన్నే మార్చారని కొనియాడారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అద్వానీ.. 1970లో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతగా, అనంతరం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

పార్లమెంటరీ బాధ్యతలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకునేవారని మోడీ గుర్తుచేశారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో అద్వానీ గాంధీనగర్ సహా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన నామినేషన్ పత్రాల తయారీలో తాను సహాయం చేశానని, ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నానని మోడీ వెల్లడించారు. గాంధీనగర్ ఓటరుగా పలుమార్లు అద్వానీకే ఓటు వేసినట్లు తెలిపారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం

అద్వానీ రాజకీయ జీవితంలో ఎమర్జెన్సీ ఒక కీలక మలుపు అని మోడీ పేర్కొన్నారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన ముందుండి పోరాడారని గుర్తుచేశారు. ఆ సమయంలో తన అనుభవాలను అద్వానీ ‘A Prisoner’s Scrap-Book’ అనే పుస్తకంలో వివరించారని చెప్పారు. అందులోని ‘A Tale of Two Emergencies’ అనే భాగంలో 1975లో భారత్‌లో జరిగిన పరిణామాలకు, 1933లో నాజీ జర్మనీలో చోటుచేసుకున్న ఘటనలకు మధ్య ఉన్న పోలికలను వివరించారని మోడీ పేర్కొన్నారు.

రామ రథయాత్ర భారత రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం

సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ చేపట్టిన రామ రథయాత్ర భారత రాజకీయ, సామాజిక చరిత్రలో కీలక ఘట్టమని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఈ యాత్ర ప్రారంభ ఆలోచన నుంచి అమలు వరకు తాను కూడా భాగస్వామిగా ఉండే అవకాశం రావడం తన అదృష్టమని మోడీ తెలిపారు. సోమనాథ్‌లో యాత్ర ప్రారంభమైన సమయంలో అక్కడ ఉండటం ప్రత్యేక అనుభూతి అని గుర్తుచేసుకున్నారు. సుదీర్ఘ ప్రయాణాలు, నిరంతర పర్యటనలు, శారీరక అలసటను అధిగమిస్తూ యాత్రను కొనసాగించడంలో అద్వానీ అద్భుతమైన పట్టుదల చూపించారని ప్రశంసించారు.

బిహార్‌లో అద్వానీ అరెస్టు, రామమందిర అంశంపై రాజీ లేదని చాటి చెప్పేందుకు గుజరాత్‌లోని చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలను కూడా మోడీ గుర్తుచేశారు. రామమందిర నిర్మాణం కోసం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఆలయ నిర్మాణం సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రజల ఆశీస్సులతో అయోధ్యలో శ్రీరాముడి భవ్య మందిర నిర్మాణం సాకారమైందని తెలిపారు.

సమర్థవంతమైన హోంమంత్రిగా అద్వానీ సేవలు

అద్వానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించారో.. పాలనలోనూ అంతే సమర్థవంతంగా పనిచేశారని మోడీ కొనియాడారు. భారత ఉప ప్రధానిగా, అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన నాయకుల్లో ఒకరిగా దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భద్రతా బలగాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఉగ్రవాదంపై ఆయన తీసుకున్న కఠిన వైఖరి దేశానికి బలమైన ఉగ్రవాద నిరోధక చట్టం రావడానికి దోహదపడిందని వివరించారు.

నిరాడంబర జీవితం.. పుస్తకాలు, సినిమాలపై ఆసక్తి

అద్వానీ వ్యక్తిగత జీవితంలోని నిరాడంబరతను కూడా మోడీ తన వ్యాసంలో ప్రస్తావించారు. నవనిర్మాణ ఉద్యమం అనంతరం గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఒక సాధారణ కార్యకర్తగా నెల రోజుల పాటు ఉంటూ అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేశారని గుర్తుచేశారు. అద్వానీకి పుస్తకాలు చదవడంపై ఎంతో ఆసక్తి ఉందని, వార్తాపత్రికలను నిశితంగా పరిశీలిస్తారని తెలిపారు. సినిమాలు, నాటకాలపై కూడా ఆయనకు ప్రత్యేక అభిరుచి ఉందని చెప్పారు. ఆయన చరిత్రపై ఉన్న అవగాహనకు ‘My Country My Life’ పుస్తకం నిదర్శనమని పేర్కొన్నారు.

సింధీ సంస్కృతితో అద్వానీ ఎప్పుడూ అనుబంధాన్ని కొనసాగించారని, లేహ్ సమీపంలో సింధు దర్శన్ పూజను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేశారని మోడీ వెల్లడించారు. తాను కూడా అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్‌లతో కలిసి ఒకసారి ఈ పూజకు హాజరైనట్లు గుర్తుచేసుకున్నారు. అద్వానీ ప్రజా జీవితంలో ఆయన భార్య కమలా అద్వానీ అందించిన సహకారాన్ని కూడా మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె ఆయనకు నిరంతరం అండగా నిలిచిన వ్యక్తి అని పేర్కొన్నారు.

అద్వానీ 100వ జన్మదిన వేడుకలకు బీజేపీ ప్రత్యేక ఏర్పాట్లు

అద్వానీ 100వ జన్మదిన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బీజేపీ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు పలువురు సీనియర్ పార్టీ నాయకులు హాజరుకానున్నారు. అద్వానీ స్ఫూర్తిదాయక జీవితం, దేశం పట్ల ఆయన అంకితభావం, పార్టీ నిర్మాణంలో చేసిన కృషి, ప్రజాసేవలో సాగించిన సుదీర్ఘ ప్రస్థానాన్ని ఈ కార్యక్రమంలో స్మరించుకోనున్నారు.

ఎల్‌కే అద్వానీ రాజకీయ ప్రస్థానం.. కీలక వివరాలు

1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో లాల్ కృష్ణ అద్వానీ జన్మించారు. 1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో స్వయంసేవక్‌గా చేరారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో అత్యంత కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

1986 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు మూడు విడతల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నాయకుడిగా నిలిచారు.

1990లో దేశవ్యాప్తంగా చేపట్టిన రామ రథయాత్ర బీజేపీ రాజకీయ ఎదుగుదలలో కీలక మలుపుగా నిలిచింది.

1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా సేవలందించారు.

దేశానికి, ప్రజా జీవితానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2015లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. 2024లో భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నకు ఎంపికయ్యారు. అదే ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు.

దశాబ్దాల పాటు భారత రాజకీయాలను ప్రభావితం చేసిన అద్వానీ.. బీజేపీ నిర్మాణం, విస్తరణలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.