Site icon NTV Telugu

Salman Threat Case: సల్మాన్ నుంచి డబ్బులు వసూలు చేయడానికే లేఖ

Salman

Salman

సల్మాన్ ఖాన్ బెదిరింపు లేఖ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బడా వ్యాపారవేత్తలు, నటుల నుంచి డబ్బు వసూలు చేయడానికే లేఖ పంపినట్లు మహారాష్ట్ర హోంశాఖ వెల్లడించింది.

పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మరణించిన కొద్ది రోజులకే, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రికి హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్ తండ్రి స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాగింగ్‌కు వెళ్లగా.. అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఓ లేఖ వదిలి వెళ్లారు. దివంగత పంజాబ్​ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఆ లేఖ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్ర హోం శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. బిష్ణోయ్ గ్యాంగ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌ను బెదిరించడం వెనుక కారణం తమ శక్తిని చూపించి భయానక వాతావరణాన్ని సృష్టించడమేనని తెలిపింది. బడా వ్యాపారవేత్తలు, నటీనటుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఈ ముఠా సిద్ధమైందని తెలిపారు.

కాగా, గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి పంజాబ్ రాష్ట్రానికి భారీ భద్రతతో తీసుకొచ్చారు. మాన్సా జిల్లాలోని కోర్టులో బిష్ణోయ్‌ను హాజరుపరచగా.. అతనికి ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు పంజాబ్ పోలీసులు మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. ఈ కేసులో పంజాబ్ పోలీసులు బిష్ణోయ్‌ను అధికారికంగా అరెస్టు చేసిన తర్వాత అతనిని హాజరుపరచడంతో ఢిల్లీ కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. సిద్ధూ మూసేవాలా హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని జూన్ 8న ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Exit mobile version