Kolkata doctor case: కోల్‌కతా పీజీ ట్రైనీ వైద్యురాలి అత్యాచార, హత్య ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, ప్రజలు రోడెక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ వైఫల్యం, పోలీసులు నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుని హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే, ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసుని ఎందుకు బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు..? ఆర్జీ కర్ ఆస్పత్రిపై దుండగుల దాడి, క్రైమ్ సీన్‌లో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల భాగస్వామ్యం ఉందని ప్రతిపక్షాలతో పాటు సాధారణ ప్రజలు ఆరోపిస్తు్న్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని సీఎం మమతా బెనర్జీ ర్యాలీ చేశారు, ఆస్పత్రి దాడి వెనక బీజేపీ, సీపీఎం పార్టీలు ఉన్నాయని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ కూతరు చనిపోయిన మొదటి రోజు నుంచే పోలీసులు వేధింపులు ప్రారంభయమ్యాయని, కుమార్తె మృతదేహం చూసేందుకు 3 గంటల పాటు అనుమతించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఇది ఒక వ్యక్తి చేసిన సంఘటన కాదని, దీని వెనక ఇతరుల ప్రమేయం ఉందని బాధితురాలి తల్లి ఆరోపించారు. తమ కుమార్తె ఆరోగ్యం, ఆమె వద్ద దొరికిన మెడిసిన్స్‌పై దృష్టి సారించారని, కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
Read Also: Crime: మైనర్ బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం..
నిజానికి ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని నిందితుడిగా అరెస్ట్ చేశారు. అయితే, అతనే ప్రధాన నేరస్తుడు కాదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తాము తెలిపామని బాధితురాలి తల్లి చెప్పారు. ‘‘ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి నాకు చెప్పారు. ఆ వ్యక్తి ప్రధాన నిందితుడిగా పరిగణించడం లేదని నేను ఆమెకు చెప్పాను. లోపల నుంచి ఎవరైనా సాయం చేయకుంటే, తన కుమార్తె ఒంటరిగా ఉందని ఎలా తెలుసుకోగలిగాడు..?’’ అని డాక్టర్ తల్లి ఆమె ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో మరికొన్ని కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇప్పటి వరకు ఇవి ఆరోపణలుగా మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సున్నిత సమచారాన్ని డాక్టర్ వెలికి తీసి ఉండొచ్చని, ఇందులో డ్రగ్ సైఫనింగ్ రాకెట్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కోల్‌కతా పోలీసులు మాత్రం వీటన్నింటిని ఊహాగానాలుగా కొట్టిపారేశారు.
