Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..

  • CEC జ్ఞానేష్ కుమార్‌పై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు
  • “మోదీ ప్రభుత్వానికి కీలుబొమ్మ” అంటూ ఆరోపణ
  • జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్
  • నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని కూడా రాజీనామా చేయాలని మరో డిమాండ్..
Congress

Congress

Congress: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు, సీజేపీ వంటి పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి జ్ఞానేష్ కుమార్ “కీలుబోమ్మ”గా మారారని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) వివాదం వేళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలోనే ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేష్ కుమార్‌కు పదవిలో కొనసాగేందుకు హక్కు లేదని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

తీవ్ర విమర్శలు వస్తున్న వేళ జ్ఞానేష్ కుమార్ పదవిలో కొనసాగేందుకు హక్కు లేదని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని మోడీ జ్ఞానేష్ కుమార్‌పై ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ ప్రధాని కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. SIR ప్రక్రియ వెంటనే నిలిపేయాలని, తొలగించిన ఓటర్ల పేర్లను మళ్లీ పునరుద్ధరించాలని తీర్మానాలు చేశారు. పార్లమెంట్, కోర్టులు, వీధి పోరాటాలతో పోరాడుతామని సీడబ్ల్యూసీలో నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ 5-డిమాండ్లను పెట్టింది.

1)  ఓటర్ల జాబితాలో జరిగే ప్రతీ కీలక మార్పుకు సంబంధించిన పూర్తి డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
2)  ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించిన వారికి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు, తమ పేర్లను తిరిగి నమోదు చేసుకునేందుకు అప్పీల్ చేసే అవకాశం కల్పించాలని కోరింది.
3) రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబివతా, అవసరమైన సంబంధిత డేటాను సులభంగా అర్థం చేసుకునే ఫార్మాట్‌లో సకాలంలో అందించాలని ఖర్గే డిమాండ్ చేశారు.
4) ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, అసమానతలకు ఆధారాలు బయటపడితే వాటిపై స్వతంత్రంగా, కాలపరిమితిలో విచారణ జరపాలని కోరారు.
5)  ఎన్నికలకు సంబంధించిన కీలక డేటా, నిర్ణయాల విషయంలో సమాచారం దాచి పెట్టారనే అవకాశం లేకుండా మరింత పారదర్శకత ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.