Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు- శృంగర్ గౌరీ కేసులో దాఖలైన వ్యాజ్యంపై వారణాసి జిల్లా కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మతపరమైన సున్నితమైన అంశంలో జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేష్ గత నెలలో ఉత్తర్వులను సెప్టెంబర్ 12 వరకు రిజర్వ్ చేశారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలను ప్రతిరోజూ పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ జ్ఞానవాపి మసీదు వక్ఫ్ ఆస్తి అని పేర్కొంది. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఈ కేసును విచారిస్తోంది.గతంలో, దిగువ కోర్టు కాంప్లెక్స్‌ను వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. మే 16న సర్వే పనులు పూర్తి చేసి మే 19న కోర్టులో నివేదిక సమర్పించారు. జ్ఞానవాపి మసీదు-శృంగర్ గౌరీ కాంప్లెక్స్‌లోని వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం కనిపించిందని హిందూ పక్షం దిగువ కోర్టులో వాదించింది, అయితే ముస్లిం పక్షం దానిని వ్యతిరేకించింది.
Supreme Court: సుప్రీంకోర్టు ముందుకు నేడు 220 పిల్స్
ఇదిలా ఉండగా, కోర్టు ఆదేశాలకు ముందు నగరంలో పోలీసులు నిషేధాజ్ఞల పాటు, భద్రతను కట్టుదిట్టం చేశారు. వారణాసిలో ఆంక్షలను ధ్రువీకరిస్తూ పోలీసు కమీషనర్ ఎ.సతీష్ గణేష్ ఆదివారం మాట్లాడుతూ.. వారణాసి కమిషనరేట్‌లో నిషేధాజ్ఞలు జారీ చేశామని, శాంతిభద్రతలు పరిరక్షించేలా చూసేందుకు ఆయా ప్రాంతాల్లోని మత పెద్దలతో సంభాషించాలని అధికారులను కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, నగరం మొత్తాన్ని వారి అవసరాలకు అనుగుణంగా పోలీసు బలగాలను కేటాయించిన విభాగాలుగా విభజించామని ఆయన చెప్పారు. అలాగే సున్నిత ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్, పాదయాత్ర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, హోటళ్లు, అతిథి గృహాల్లో తనిఖీలు ముమ్మరం చేసి సామాజిక మాధ్యమాలపై కూడా నిఘా ఉంచారు.