పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య తర్వాత వెలుగు చూసిన సంఘటనలు చూస్తుంటే.. మొత్తంగా కేతన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవడం సియా గోయల్‌కు ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. అయితే వీడియోల్లో కేతన్‌తో నవ్వుతూ కనిపించిందంతా అదొక డ్రామానే అని తేలిపోయింది. అయిష్టంగానే అతడితో వ్యవహరించినట్లుగా దర్యాప్తును బట్టి అర్థమవుతోంది.
ఇక తాజాగా క్యాబ్ డ్రైవర్ వైభవ్ జాధవ్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించాడు. కేతన్ అగర్వాల్ పాస్‌పోర్టు పోయినప్పుడు ఏం జరిగిందో పూసగుచ్చినట్లుగా వివరించాడు. అంతేకాకుండా ఆరోజు ఎలాంటి గొడవ జరిగిందో కూడా తెలియజేశాడు.
కేతన్‌తో కలిసి ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బాలి వెళ్లాల్సిన సియా గోయల్‌ను ఆమె సోదరుడు సాహిల్ గోయల్ బలవంతంగా కారులో ఎక్కించాడని ముంబై ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ వైభవ్ జాధవ్ తెలియజేశాడు. పోలీసుల విచారణలో డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలో నుంచి ప్రయాణం ప్రారంభమైన సమయంలో సియా గోయల్ కారులో ఎక్కేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదని.. ఆమె సోదరుడు సాహిల్ చేతిని పట్టుకుని బలవంతంగా కారులో కూర్చోబెట్టాడని చెప్పాడు. ఇక పూణె నుంచి రావేట్ వరకు ప్రయాణిస్తున్న సమయంలో సియా, సాహిల్ మధ్య కారులో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కూడా వెల్లడించాడు. ఆ తర్వాత కేతన్ అగర్వాల్.. అతని కుటుంబ సభ్యులు కివాలే ప్రాంతంలో కారులోకి ఎక్కిన తర్వాత అందరూ కలిసి ముంబై విమానాశ్రయానికి బయల్దేరినట్లు చెప్పాడు. అయితే మార్గమధ్యలో ఖలాపూర్ సమీపంలోని ఓ ఫుడ్ మాల్ దగ్గర టీ, అల్పాహారం కోసం ఆగినట్లు డ్రైవర్ వెల్లడించాడు. అయితే ఈ సమయంలో మొబైల్ ఫోన్ కారులో మరిచిపోయానని చెప్పి సియా ఒక్కరే తిరిగి కారు దగ్గర వెళ్లిందని.. అక్కడి నుంచి కొన్ని వస్తువులను తీసుకుని తన జేబులో పెట్టుకున్నట్లు తాను గమనించినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు.
ఇక అందరినీ ముంబై ఎయిర్‌పోర్ట్ దగ్గర దించి వెళ్లిపోయిన తర్వాత కేతన్ అగర్వాల్ నుంచి తనకు ఫోన్ వచ్చిందన్నాడు. తన పాస్‌పోర్ట్ కారులో పడిపోయిందేమో చూడాలని కోరాడని చెప్పుకొచ్చాడు. కేతన్ అభ్యర్థన మేరకు కారు మొత్తాన్ని తనిఖీ చేసినట్లుగా తెలిపాడు. కానీ ఎంత వెతికినా పాస్‌పోర్ట్ దొరకకపోవడంతో బాలి ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు.
కేతన్ తండ్రి
కేతన్ తండ్రి విజయ్ అగర్వాల్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో పాస్‌పోర్టులు, విదేశీ కరెన్సీ, క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను ఒకే పౌచ్‌లో ఉంచామని చెప్పారు. ఫుడ్ మాల్ దగ్గర మొబైల్ తీసుకొచ్చేందుకు సియా కారు దగ్గరకు వెళ్లిన తర్వాతే కేతన్ పాస్‌పోర్ట్ కనిపించకుండా పోయిందని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. జూన్ 6న ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో ఖలాపూర్ ఫుడ్ మాల్‌లో కారులో నుంచి కేతన్ పాస్‌పోర్ట్‌ను సియా తీసుకుని మహిళల వాష్‌రూమ్‌లో పడేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. పాస్‌పోర్ట్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపనున్నట్లు వెల్లడించారు.
17 కోట్ల పెళ్లి.. మరొకరితో ఎఫైర్
కేతన్ అగర్వాల్, సియా గోయల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో అంగరంగ వైభవంగా వివాహం జరగాల్సి ఉంది. అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నిశ్చితార్థానికి ముందే సియా గోయల్.. ప్రియుడు చేతన్ చౌదరితో ప్రేమలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
2,004 ఫోన్ కాల్స్.. 238 గంటల సంభాషణ
పోలీసుల దర్యాప్తులో సియా, చేతన్ మధ్య గత ఆరు నెలల్లో 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు వెల్లడైంది. ఇద్దరూ మొత్తం 238 గంటల పాటు మాట్లాడుకున్నారని, కొన్ని కాల్స్ రెండు నుంచి మూడు గంటల వరకు కొనసాగినట్లు కాల్ రికార్డుల్లో గుర్తించారు. జూన్ 18న హత్య జరిగిన రోజున కూడా ఇద్దరూ ముందుగా ఓ కేఫేలో కలుసుకుని.. అనంతరం లోహగడ్ కోటకు వెళ్లి కేతన్‌ను లోయలోకి తోసేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించి హత్య ప్రణాళికను అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసు కస్టడీలో ఉంచి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. కేతన్‌ను తమ ప్రేమకు అడ్డుగా భావించి ఇద్దరూ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

