పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమైందని పేర్కొంటూ.. దీనిని కేవలం ఒక నేరంగా మాత్రమే కాకుండా సమాజానికి గట్టి హెచ్చరికగా కూడా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? చదువుకున్న, మంచి కుటుంబాలకు చెందిన యువతలో ఇలాంటి క్రూరమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి? అనే అంశాలపై సమాజం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
పూణెలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా నిందితులకు ఉరిశిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘‘ఇది ఊహించలేని విధంగా జరిగిన అత్యంత షాకింగ్ ఘటన. ఇలాంటి సంఘటనలు సమాజాన్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. చదువుకున్న, స్థిరపడిన కుటుంబాల పిల్లల్లో ఇలాంటి విధ్వంసకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణాలేంటి? అనే దానిపై లోతుగా చర్చించాలి. ఇది కేవలం క్రిమినల్ కేసు మాత్రమే కాదు.. సామాజిక కోణంలో కూడా పరిశీలించాల్సిన అంశం. చిన్న వయసులోనే ప్రతీకారం, క్రూరత్వం వంటి భావాలు పెరగకుండా సమాజం ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాలి అనే దానిపై అందరం ఆలోచించాలి.’’ అని పేర్కొన్నారు.
ఫడ్నవిస్ హామీ
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. ఈ కేసులో దోషులుగా తేలిన ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.’’ అని వెల్లడించారు.
ఇక దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ప్రధాన నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేతన్ మరణానికి కొన్ని గంటల ముందు సియా, చేతన్ పూణెలోని ఓ కేఫేలో కలిసి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.
అసంతృప్తితోనే హత్య?
కేతన్, సియా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాలు బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కలిసిన వారం రోజుల్లోనే పెళ్లి ఖరారు చేశారు. అయితే కేతన్ తన కుటుంబ సభ్యులకు.. సియా ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉంటోందని.. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుందని చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరోవైపు పోలీసు విచారణలో సియా.. కేతన్ జుట్టు పలుచగా ఉండటం, స్వల్పంగా నత్తిగా మాట్లాడటం తనకు నచ్చలేదని చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో చేతన్ కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడు నిర్దోషి అని వాదిస్తున్నారు. ఘటన సమయంలో చేతన్ కొంత దూరంలో నిలబడి ఉండగా.. కేతన్‌కు అత్యంత సమీపంలో సియానే ఉందని, ఆమెనే కేతన్‌ను తోసివేసిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డులు, నిందితుల వాంగ్మూలాలను పరిశీలిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

