Elephant attack: ఇటీవల కాలంలో కేరళలో ఏనుగుల దాడులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో కొన్ని నెలలుగా పలువురిని ఏనుగులు చంపేశాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో ఈ ఏనుగుల దాడి అంశం రాజకీయ అస్త్రంగా మారింది. ఇదిలా ఉంటే కేరళలో ఏనుగు దాడిలో మరో ప్రాణం బలైంది. మలయాళంలో ప్రముఖ న్యూస్ ఛానెల్ కెమెరామెన్ 34 ఏళ్ల వ్యక్తి బుధవారం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఏనుగు దాడి చేసింది.
Read Also: Lorry Driver: హైవే పై లారీ తోలుతూ డేంజర్ స్టంట్ చేసిన డ్రైవర్.. వీడియో వైరల్..
మాతృభూమి న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న ఏవి ముఖేష్, తన రిపోర్టర్‌తో కలిసి దారి తప్పిన ఏనుగుల గుంపు విజువల్స్ తీస్తున్న సమయంలో దాడి జరిగింది. ఈ దాడిలో ముఖేష్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. మలంబుజా, కంజికోడ్ మధ్య ఉన్న ప్రాంతంలో జంబోస్ నదిని ఏనుగుల గుంపు దాటుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న కెమెరామెన్‌పై దాడి చేశాయి. రిపోర్టర్, వాహనం డ్రైవర్ సురక్షితంగా పారిపోయినప్పటికీ ముఖేష్‌పై ఏనుగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మలప్పురం జిల్లా పరప్పనంగడికి చెందిన ముఖేష్ ఏడాది కాలంగా మాతృభూమి న్యూస్ పాలక్కాడ్ బ్యూరోలో పనిచేస్తున్నాడు. అంతకుముందు చాలా సంవత్సరాలు న్యూఢిల్లీ బ్యూరోలో పనిచేశారు.
మాతృభూమి ఆన్‌లైన్‌లో “అతిజీవనం” అనే కాలమ్‌లో భాగంగా 100కి పైగా కథనాలను రాయడం ద్వారా ముఖేష్ రిపోర్టింగ్‌లో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇందులో అట్టడుగు ప్రజల జీవితాన్ని నివేదించాడు. ఈ కథనాల ద్వారా అట్టడుగు వర్గాల దుస్థితి అధికారులు, ప్రజల దృష్టికి చేరేలా సాయపడ్డాడు. తన కాలమ్‌లో పేర్కొన్న వ్యక్తలకు తన జీతం నుంచి డబ్బులు అందించి ఆర్థికంగా సాయపడేవారని స్థానికులు చెప్పారు. కెమెరామెన్ మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, మంత్రులు ఏకే శశీంద్రన్, ఎంబీ రాజేష్, సాజీ చెరియన్ తదితరులు సంతాపం తెలిపారు.