Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!

  • ముస్లిం మహిళలపై మతపెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు..
  • దీనిపై డిబేట్ చేసిన మహిళా యాంకర్‌పై కేసు..
Kerala

Kerala

Kerala Anchor Case: కేరళకు చెందిన ముస్లిం మతపెద్ద మహిళలను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, వ్యాఖ్యలపై టీవీ డిబేట్ నిర్వహించిన అంశం ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్లింది. ఈ చర్చల్లో పాల్గొన్న మలయాళ టీవీ జర్నలిస్ట్, యాంకర్ అపర్ణ కురుప్‌పై కొచ్చి సిటీ సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాసర్‌గోడ్‌కు చెందిన అబ్దుల్ హకీమ్ బీఎం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 07న కేసు నమోదైంది.

టీవీ డిబేట్ సమయంలో అపర్ణ కురుప్ చేసిన వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలు అల్లర్లను ప్రేరేపించేలా, మతపరమైన భావాలను దెబ్బతీయడం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో టీవీ ఛానెల్ ఆ కార్యక్రమాన్ని తొలగించింది. అపర్ణ కురుప్, ఛానెల్ యాజమాన్యం ఇప్పటికే తమ వ్యాఖ్యలపై విచారణం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే, మరోవైపు అపర్ణ కురుప్‌‌పై సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించే పోస్టులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ కేసులో విజ్డమ్ స్టూడెంట్స్ సంస్థకు చెందిన అబ్దుల్లా బాసిల్ సి.పి.తో పాటు మరో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది.

ఇటీవల సున్నీ మత పండితుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మతపరమైన వేడుకల సమయంలో ముస్లిం మహిళలు తమకు సంబంధం లేని పురుషులతో కలిసి బహిరంగ ప్రదేశాల్లో ఉండటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలు కేరళలో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. కేరళ సీఎం వీడీ సతీషన్ మాట్లాడుతూ.. ముస్లిం పండితుడి వ్యాఖ్యలు 21వ శతాబ్ధపు ప్రగతిశీల ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.