Site icon NTV Telugu

Kejriwal vs Judge: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌లు న్యాయం చేయలేరు.. జస్టిస్‌పై కేజ్రీవాల్ ఆరోపణలు వైరల్

Kejriwal

Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కేజ్రీవాల్ వర్సెస్ న్యాయవ్యవస్థ ఫైటింగ్‌గా మారిపోయింది. ఫిబ్రవరి 27న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా 21 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో దర్యాప్తు సంస్థ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసును స్వయంగా కేజ్రీవాలే వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్ విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ పలు కీలక ఆరోపణలు చేశారు. ఆధ్యాత్మిక, రాజకీయ అనుబంధాలు కలిగిన వారు తన కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపరని ఆరోపించారు. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నాలుగుసార్లు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యారని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-బీజేపీ భావజాలాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తాను ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నందున తన కేసులో నిష్పక్షపాత విచారణపై అనుమానం ఉందని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ వర్సెస్ కేజ్రీవాల్‌‌‌ వివాదంగా మారిపోయింది.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక విషయాన్ని గుర్తుచేశారు. న్యాయవ్యవస్థలో న్యాయం జరిగేటట్లు మాత్రమే కాకుండా.. న్యాయం జరిగినట్లుగా కనిపించాలనేది కూడా ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కేజ్రీవాల్ ప్రస్తావించారు. సీబీఐపై ‘‘కేజ్‌డ్ ప్యారట్’’ వ్యాఖ్యను గుర్తు చేస్తూ దర్యాప్తు సంస్థల స్వతంత్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే న్యాయమూర్తి, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ జోక్యం చేసుకుంటూ కేజ్రీవాల్ వాదనలను రికార్డులో నమోదు చేస్తామని తెలిపారు. తాను ఏ సిద్ధాంతాన్నీ అనుసరించడం లేదని స్వర్ణ కాంత శర్మ స్పష్టం చేశారు.

కేజ్రీవాల్–న్యాయమూర్తి సంభాషణ వైరల్.. ఎవరు ఏమన్నారు?

అరవింద్ కేజ్రీవాల్: ‘‘మీరు ఒక ప్రత్యేక సిద్ధాంతానికి చెందిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అందువల్ల నా మనసులో పక్షపాతం ఉందనే భావన కలుగుతోంది.’’

జస్టిస్ స్వర్ణ కాంత శర్మ: ‘‘నేను ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నానని మీరు చెబుతున్నారా?’’

కేజ్రీవాల్: ‘‘నేను అలా అనడం లేదు. కానీ మీరు ఆ కార్యక్రమాలకు హాజరైనందున.. ఆ సిద్ధాంతానికి మీరు అనుకూలంగా ఉండవచ్చని అనిపిస్తోంది.’’

జస్టిస్ శర్మ: ‘‘మీరు చెప్పిన వాదనను మాత్రమే రికార్డులో నమోదు చేస్తాను.’’

మార్చి 9న సీబీఐ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 6న జరిగిన విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కేజ్రీవాల్ రిక్యూస్ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ.. అది ఆధారరహితమని పేర్కొన్నారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version