NTV Telugu Site icon

KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం.

Kcr To Go Bihar

Kcr To Go Bihar

KCR to go Bihar: బీహార్‌లో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ఆ రాష్ట్రానికి వెళ్లాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నిన్న మంగళవారమే నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. బీహార్‌ పాలిటిక్స్‌ అనూహ్యంగా మారటం కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించింది. దీంతో అక్కడి పరిణామాలను ఆయన ఆసక్తిగా, నిశితంగా పరిశీలిస్తున్నారు.

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీ గుడ్‌బై చెప్పటం, వెంటనే మహాఘట్‌బంధన్‌తో జట్టు కట్టడం బీహార్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలకు మస్తు సంతోషం కలిగించింది. ఈ పార్టీల జాబితాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రంలో యాంటీ-బీజేపీ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు బీహార్‌ లేటెస్ట్‌ అప్‌డేట్ బూస్ట్‌లా బలాన్నిచ్చిందని పార్టీ నేతలతో కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Netflix Games: నెట్‌ఫ్లిక్స్‌ ‘ఆటలు’ సాగట్లేదు. కనీసం ఒక్క శాతం మంది అయినా చూస్తే ఒట్టు.

2024 సాధారణ ఎన్నికలకు చాలా ముందే నితీష్‌ కుమార్‌ బీజేపీ నుంచి దూరం జరగటం విపక్షాలకు కచ్చితంగా ప్లస్‌ పాయింటేనని గులాబీ నేత నొక్కి చెప్పినట్లు టాక్‌. బీహార్‌ పరిణామాలపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. అయినా అంతర్గతంగా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్‌ అతిత్వరలో బీహార్‌ వెళ్లి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ని, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ని కలిసి అభినందించనున్నారని విశ్వసనీయ సమాచారం.

ఈ సమావేశంలో భవిష్యత్‌ జాతీయ రాజకీయాల పైనా చర్చిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఆర్జేడీ ఆశాకిరణం తేజస్వీ యాదవ్‌కి, కేసీఆర్‌కి మధ్య నేషనల్‌ పాలిటిక్స్‌పై తొలి విడత చర్చలు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో తేజస్వీ యాదవ్‌ హైదరాబాద్‌ వచ్చి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమి దిశగా తాను చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్‌ ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌కి వివరించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఈపాటికే ఒక అవగాహన ఏర్పడింది. దీన్ని రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు.

2020 జూన్‌లో గల్వాన్‌ లోయలో అమరులైన సైనికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని కేసీఆర్‌ గతంలో ప్రకటించిన విషయం విధితమే. బీహార్‌ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ ఆ రాష్ట్ర సైనికుల కుటుంబాలను స్వయంగా కలిసి చెక్కులు అందజేయనున్నారు. కొన్నాళ్లుగా బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న కేసీఆర్‌ బీహార్‌ పర్యటన అనంతరం ఇంకా జోష్‌గా జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెడతారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Show comments