Site icon NTV Telugu

Kcr And Uddhav thackeray: 20న ఉద్దవ్ తో కేసీఆర్ భేటీ ఖరారు

బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి వివిధ రాష్ట్రాల సీఎంలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 20 తేదీ న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిధ్యాన్ని అందుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు. బుధవారం సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ థాకరే, దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.

బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం, సీఎం కేసిఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే తన సంపూర్ణ మద్దతును పలికారు. ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ… ” కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు.మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి.మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది.ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం…” అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

“మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భం లో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం..” అని సీఎం కేసీఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు. వీరిద్దరి సమావేశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

https://ntvtelugu.com/former-minister-devegowda-gives-supports-to-telangana-cm-kcr/
Exit mobile version