Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!

  • రష్యాలో కావేరి డ్రై ఇంజిన్ కీలక పరీక్షలు విజయవంతం
  • హై-ఆల్టిట్యూడ్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శన
  • అనుకున్న లక్ష్యాన్ని మించి పనిచేసిన ఇంజన్
  • ఘాతక్ స్టెల్త్ డ్రోన్లలో ఉపయోగించేందుకు రెడీ
Kaveri Engine

Kaveri Engine

Kaveri Engine: భారత్ స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన జెట్ ఇంజన్ ‘‘కావేరి’’ సత్తా చాటింది. రష్యాలో నిర్వహించిన కావేరి ఇంజన్ డ్రైరన్‌లో కీలక మైలురాయిని చేరకుకుంది. రష్యాలో నిర్వహించిన హై-ఆల్టిట్యూడ్, ఫ్లైట్ ట్రయల్స్‌లో అనుకున్నదాని కన్నా మరింత సమర్థవంతంగా పనిచేసింది. ఈ టెస్టుల్లో ఇంజన్ గరిష్టంగా 48.5 కిలోన్యూటన్ల డ్రై థ్రస్ట్ సాధించినట్లు తాజా రక్షణ రంగ నివేదికలు పేర్కొన్నాయి. నిర్దేశించిన 46 కిలోన్యూటన్ల థ్రస్ట్ లక్ష్యాన్ని అధిగమించింది.

DRDOకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE) అభివృద్ధి చేసింది. రష్యాలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఏవియేషన్ మోటార్స్(CIAM), గ్రోమోవ్ ఫ్లైట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కావేరి ఇంజన్‌ను పరీక్షించారు. తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ వాయు పీడనం ఉండే అధిక ఎత్తు పరిస్థితుల్లో ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించారు.

ఘాతక్ స్టెల్త్ డ్రోన్‌లకు సరికొత్త శక్తి..

ఈ ఇంజన్ ప్రధానంగా డీఆర్డీఓ రూపిందించిన ఘాతక్ స్టెల్త్ డ్రోన్లలో ఉపయోగించే అవకాశం ఉంది. మానవ రహిత యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజన్ అందుబాటులోకి రావడంతో, విదేశాలపై భారత్ ఆధారపడటం తగ్గుతుంది. కావేరీ ఇంజన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే CEMILAC (సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్) ఆమోదం అవసరం, ఒక్కసారి ఆమోదం లభిస్తే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ఈ ఇంజన్‌ను ఉత్పత్తి చేస్తుంది.