Karnataka: కర్ణాటక మాండ్యా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని కేరగోడు గ్రామంలో ప్రజలు 108 అడుగుల ఎత్తున హనుమాన్ జెండాను ఆవిష్కరించారు. అయితే, ఈ రోజు తెల్లవారుజామున స్థానిక అధికారులు ఈ జెండాను తొలగించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాషాయ జెండాను ఎగరేసినందుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు బలవంతంగా జెండాను తీయించారు.
రామాలయం సమీపంలో 108 అడుగుల ఎత్తున స్తంభాన్ని ప్రతిష్టించి, హనుమంతుడి చిత్రం ఉన్న కాషాయ జెండాను ఎగరేశారు. అయితే, గ్రామస్తులు ఎంత చెప్పినా వినకుండా అధికారలు దీన్ని తొలగించేశారు. దీంతో స్థానికులు ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హిందువులు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలో నిరసనలకు మద్దతుగా అన్ని వ్యాపారాలను బంద్ చేశారు.
Read Also: Pinarayi Vijayan: కేరళలో ముదురుతున్న గవర్నర్-సీఎం మధ్య వార్..
ప్రతిపక్ష బీజేపీ నేత ఆర్ అశోక్ మాట్లాడుతూ.. ఈ ఘటన వెనక కాంగ్రెస్ హస్తముందని ఆరోపించారు. మరోవైపు గ్రామస్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతని ప్లెక్సీలను, బ్యానర్లను తీసేశారు. గ్రామంలోని మెయిన్ సెంటర్‌లో వంటలు చేసేందుకు ఎమ్మెల్యే ప్లెక్సీలను ఉపయోగించారు. గ్రామ పంచాయతీ సీఈవో షేక్ తన్వీర్ ఆసిఫ్ జెండాను కిందకు లాగేందుకు ప్రయత్నించారని, గ్రామస్తులు దీన్ని వ్యతిరేకించారని మాండ్య ఎస్పీ పేర్కొన్నారు.
మాండ్యాలోని కెరగోడు గ్రామంలో జాతీయ జెండాకు బదులుగా హనుమాన్ జెండాను ఎగురవేయడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్రదుర్గలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హనుమాన్ జెండాకు బదులుగా అనుమతి ఉన్న విధంగా జాతీయ జెండా, కర్ణాటక జెండాను ఎగురవేయాలని కోరారు.