NTV Telugu Site icon

Neha Murder Case: “నా కొడుకు చేసింది తప్పే”.. క్షమాపణలు కోరిన నిందితుడు ఫయాజ్ తల్లి..

Neha Hemareth

Neha Hemareth

Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిమరేత్‌ని అత్యంత దారుణంగా పొడిచి చంపడం ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదమైంది. హుబ్బళ్లిలో ఓ కాలేజీలో ఏంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నేహ(23)ని ఆమె సీనియర్ విద్యార్థి ఫయాజ్ హత్య చేశాడు. ఈ ఘటన కాలేజ్ క్యాంపస్‌లో జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ హత్య కేసులో నిందితడు ఫయాజ్‌ని అరెస్ట్ చేశారు. కత్తిపోట్ల కారణంగానే బాధితురాలు చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో ‘‘లవ్ జిహాద్’’ కోణం ఉందని బీజేపీ ఆరోపించింది. చివరకు ఆమె తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా నిరంజన్ హిరేమత్ కూడా.. తన కూతురును ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారని, అందుకు లొంగకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం ఇది వ్యక్తిగత వివాదమని, ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, నిందితుడు ఫయాజ్ తల్లి ముంతాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు తరుపున నేను కర్ణాటక ప్రజలందరికీ క్షమించమని కోరుతున్నాను. నేను అమ్మాయి తల్లిదండ్రుల్ని కూడా క్షమించాలని కోరుతున్నాను. ఆమె నా కూతురు లాంటిది. నేను ఇక్కడ ఎలాంటి భేదం చూపడం లేదు. వారు ఎలా బాధపడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా అంతే బాధతో ఉన్నానను. నా కొడుకు చేసింది తప్పే. అతను నా కొడుకైనా తప్పు తప్పే’’ అని అన్నారు.

Read Also: Shahid Afridi: “ఇది పొరుగువారి హక్కు”.. రోహిత్ శర్మ వ్యాఖ్యలపై అఫ్రిది రెస్పాన్స్..

తన కొడుకు చేసిన పనికి దేశ చట్టం ప్రకారం శిక్షించాల్సిందే అని ముంతాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, తన కొడుకు, బాధితురాలు నేహ ప్రేమించుకున్నారని, ఈ విషయం నాకు గతేడాది కాలంగా తెలుసని చెప్పారు. అయితే, ఫయాజ్‌ తన కుమార్తెకు స్నేహితుడు మాత్రమే అని, నిందితుడితో ఎలాంటి రిలేషన్ లేదని అన్నారు. అయితే, అతను చేసిన ప్రపోజల్స్‌ని నేహ ప్రతీసారి తిరస్కరించదని చెప్పారు. ఇలాగే చేస్తే తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు నేహా తండ్రి వెల్లడించారు.

ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయితే ఈ ఆరోపణల్ని కర్ణాటక ప్రభుత్వం తోసిపుచ్చింది. నేహా, ఫయాజ్ మధ్య రిలేషన్‌షిప్ ఉందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర అన్నారు. నేహా హత్యపై బీజేపీ, రైట్ వింగ్ కార్యకర్తలు హుబ్బళ్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలను సాకుగా చూపి బీజేపీ రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోందని కాంగ్రెస్ ప్రతి ఆరోపణలు చేసింది.