Karnataka MLC Elections: కర్ణాటకలో మళ్లీ ‘రిసార్ట్’ రాజకీయం.. అంతా ‘క్రాస్ ఓటింగ్’ భయమేనా?

Karnataka

Karnataka

Karnataka MLC Elections: దక్షిణాది రాజకీయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ‘రిసార్ట్ పాలిటిక్స్’ తెరపైకి రావడం ఆనవాయితీగా మారింది. తాజాగా జూన్ 18న జరగనున్న కర్ణాటక శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి మొదలైంది. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాల నుంచి, క్రాస్ ఓటింగ్ (Cross-Voting) భయాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే జూన్ 16 నుంచే ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్ క్యాంప్‌నకు తరలించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

పార్టీ నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం.. జూన్ 16న కాంగ్రెస్ శాసనసభ పక్ష (CLP) సమావేశం ముగిసిన వెంటనే, ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, మైసూరు రోడ్డులోని వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్ ప్రాంగణంలో ఉన్న ప్రముఖ ‘టెర్రియా రిసార్ట్’ (Terria Resort) కు తరలించనున్నారు. జూన్ 18న పోలింగ్ జరిగే రోజున వీరిని నేరుగా రిసార్ట్ నుంచే అసెంబ్లీకి తరలించి ఓటు వేయించనున్నారని సమాచారం. అప్పటివరకు ఎమ్మెల్యేలెవరూ బయటి వ్యక్తులతో మాట్లాడకుండా చూడనున్నారట. ప్రస్తుతం కర్ణాటక శాసనసభలో 222 మంది సభ్యులు ఉండగా (రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), ఏడు శాసన మండలి స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో అభ్యర్థి విజయం సాధించడానికి 28 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాల కోసం మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున బి.కె. హరిప్రసాద్, తిప్పనప్ప కామక్నూర్, పి.వి. మోహన్, శివన్న బి.ఎస్., వినయ్ కార్తీక్ ప్రకాష్ సహా ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా బీజేపీ నుంచి లింగరాజ్ పాటిల్, రఘు ఆర్. బరిలో ఉండగా, జేడీఎస్ (JDS) నుంచి గోవిందరాజు నామినేట్ అయ్యారు.

×
×
Ad

7వ సీటు పైనే అసలు పంచాయితీ

అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య ప్రకారం.. కాంగ్రెస్ 4 స్థానాలను, బీజేపీ 2 స్థానాలను సునాయాసంగా గెలుచుకునే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే చివరి స్థానం అయిన ఏడవ సీటు కోసం జరుగుతున్న పోరే ఇప్పుడు ఈ రిసార్ట్ రాజకీయాలకు కారణమైందని సమాచారం. చివరి సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కార్తిక్ ప్రకాష్, జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజుల మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఇరు పార్టీలకూ సరిపడా సొంత ఓట్లు లేకపోవడంతో, ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్ చేయించేందుకు తెరవెనుక భారీ వ్యూహాలు నడుస్తున్నాయని తెలియడంతో ఈ ఒక్క సీటును ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉండటంతో, తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఈ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ‘లాస్ట్ సీట్’ పోరు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.