Site icon NTV Telugu

Priyank kharge: ఆ సర్వే ప్రభుత్వం చేయించలేదు.. బీజేపీ ఆరోపణలు తిప్పికొట్టిన కర్ణాటక మంత్రి

Priyank Kharge

Priyank Kharge

కర్ణాటకలో ‘ఎన్నికల సర్వే’ వ్యవహారంపై దుమారం రేపుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బీజేపీ ఆరోపణలను మంత్రి ప్రియాంక ఖర్గే తోసిపుచ్చారు. మీడియాలో ప్రచారం అవుతున్న ఎన్నికల సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించలేదని పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఏ ఏజెన్సీకి ప్రభుత్వం ఆదేశించలేదని.. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తిప్పికొట్టారు. సర్వేల పేరుతో బీజేపీ ఏం చేయాలనుకుంటోందని నిలదీశారు.

కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ ఎన్నికల సర్వే నిర్వహించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఈవీఎంలపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారని.. 83 శాతం మంది బలమైన విశ్వాసం వ్యక్తపరిచారని పేర్కొంది. అయితే ఈ సర్వేను సిద్ధరామయ్య ప్రభుత్వమే చేయించిందని.. ఇది కాంగ్రెస్‌కు చెంపదెబ్బలాంటిదని బీజేపీ ఆరోపించింది. అయితే తాజాగా కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఆ సర్వే తాము చేయించలేదని ప్రియాంక ఖర్గే పేర్కొన్నారు.

డెక్కన్ హెరాల్డ్(ఆంగ్ల పత్రిక) నివేదిక ప్రకారం.. ఈ సర్వేను ప్రధాన ఎన్నికల అధికారి అన్బుకుమార్ చేయించినట్లుగా పేర్కొంది. బెంగళూరు, బెలగావి, కలబురగి, మైసూరు సహా 102 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5,100 మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్లుగా తెలిపింది. దాదాపు 83 శాతం మంది ఈవీఎంల ఓటింగ్‌పై మద్దతు తెలిపినట్లుగా పేర్కొంది.

Exit mobile version