NTV Telugu Site icon

Karnataka – Maharashtra Border: కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన ఆందోళనకారులు

Karnataka Maharashtra Borde

Karnataka Maharashtra Borde

Karnataka Maharashtra Border Issue Karnataka Activists Pelt Stones: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య చాలాకాలం నుంచే సరహద్దు వివాదం కొనసాగుతోంది. 1960లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా.. తమ రాష్ట్రానికి చెందిన మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకలో తప్పుగా కలిపారంటూ మహారాష్ట్రా వాదిస్తూనే ఉంది. దీనిపై ఆ రాష్ట్రం సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. మరోవైపు.. కర్ణాటక కూడా తమ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గ్రామాలు ఉన్నాయని కర్ణాటక పేర్కొంటోంది. ఇలా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు విషయమై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. వారం రోజుల క్రితం బెళగావిలోని ఒక కళాశాల ఉత్సవాల్లో ఓ విద్యార్థి కర్ణాటక జెండాను ప్రదర్శించడంతో.. మరాఠీ విద్యార్థులు అతడిపై దాడి చేశారు. దీంతో.. సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కర్ణాటక రక్షణ వేదిక బెళగావిలో ఆందోళనలు చేపట్టింది. ఆ వేదికకు చెందిన 400 మంది ఆందోళనకారులు.. కర్ణాటక జెండాలు పట్టుకొని, ధార్వాడ్‌ జిల్లా నుంచి బెళగావికి వెళ్లి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నంబర్‌ ప్లేట్స్‌ ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని.. వాటిపై దాడులకు ఎగబడ్డారు. ఈ దాడుల్లో పుణె నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ లారీ విండ్‌షీల్డ్‌, అద్దం ధ్వంసమైంది. పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసుల మాట పట్టించుకోకుండా ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించారు. ఈ నేపథ్యంలోనే.. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామల వద్ద వెయ్యి మందికిపైగా పోలీసుల్ని ప్రభుత్వం మోహరించింది. నగరంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి అవాంతరాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు.

ఇదిలావుండగా.. ఈ ఆందోళనలకు ముందు మహారాష్ట్రకు చెందిన మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, శంభురాజ్‌ దేశాయ్‌లు బెళగావిలో మంగళవారం పర్యటించాలని అనుకున్నారు. అయితే.. వారి పర్యటన శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై హెచ్చరించటంతో, వాళ్లు తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ఇద్దరిని కోఆర్డినేటర్లుగా నియమించింది.