Karnataka High Court dismisses plea challenging ban on PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారించింది కర్ణాటక హైకోర్టు. పీఎఫ్ఐ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్ని కొట్టేసింది. నిషేధాన్ని సమర్థించింది. పీఎఫ్ఐ కర్ణాటక అధ్యక్షుడు నసీర్ పాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై ఇంతకుముందు కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
నిషేధాన్ని సమర్థించడంలో కేంద్రం విఫలం అయినట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టులో తన వాదనలు వినిపించారు. వివిధ నేరాలకు సంబంధించిన సంఘటనలను కేంద్ర పరిగణలోకి తీసుకుని నిషేధం విధించిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం మైనారిటీల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్ వాదించాడు. పీఎఫ్‌ఐపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్‌పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్
సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థలు, నాయకులు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఈడీ సంస్థలు దాడులు చేశాయి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండటంతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో కనుక్కున్నారు. దీంతో పాటు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి), జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎమ్‌బి), ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
1,400 మంది పీఎఫ్ఐ కార్యకర్తలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. వీటిలో రైట్ వింగ్ కార్యకర్తలను హత్య చేసిన కేసులు కూడా ఉన్నాయని కేంద్ర తెలిపింది. యూఏపీఏ చట్టం కింద సెప్టెంబర్ నెలలో ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. మొత్తం 300 మందికి పైగా పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం.