కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జారీ చేసిన పాఠశాల యూనిఫాం నిబంధనలను ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్‌తో పాటు జంధ్యాలు ధరించేందుకు విద్యార్థులకు అనుమతి లభించింది. గతంలో అమల్లోకి వచ్చిన యూనిఫాం ఆదేశాల కారణంగా హిజాబ్ ధరించే అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మతపరమైన గుర్తింపుల ప్రదర్శనపై తీవ్ర వివాదం నెలకొంది. ఇప్పుడు తాజా నిర్ణయంతో ఆ ఆదేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు హిజాబ్, పవిత్ర దారాలు వంటి మతపరమైన గుర్తింపులను ధరించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పాఠశాలల్లో క్రమశిక్షణ, విద్యా వాతావరణానికి భంగం కలగకుండా ఉండాలని కూడా సూచించింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. హిజాబ్ వివాదం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక రాజకీయ అంశంగా మారిన విషయం తెలిసిందే.
