NTV Telugu Site icon

Karnataka Bank heist: ‘‘మనీ హీస్ట్’’ చూసి 17 కిలోల బంగారం దోపిడి .. చివరకు ఇలా చిక్కారు..

Karnataka Bank Heist

Karnataka Bank Heist

Karnataka Bank heist: కర్ణాటక పోలీసులు దావణగెరె ఎస్‌బీఐ దోపిడీని ఛేదించారు. హై ప్రొఫైల్ న్యామతి ఎస్‌బీఐ బ్యాంక్ దొంగతనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 13 కోట్ల విలువైన 17.7 కిలోల బంగారాన్ని దోపిడీ చేశారు. కర్ణాటక పోలీసులు 5 నెలలు కష్టపడి దర్యాప్తు చేసి, ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దోపిడీ.. దర్యాప్తు..

అక్టోబర్ 28, 2024న, రెండు రోజుల వీకెండ్ తర్వాత బ్యాంక్ సిబ్బంది తమ స్ట్రాంగ్ రూమ్ లాకర్లలో ఒకటి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఉండటాన్ని గమనించారు. లాకర్‌ని దోచుకుని, తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకుని పారిపోయినట్లుగా గుర్తించారు. నిందితులు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు, సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ని మాయం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్వ్కాడ్ ఎలాంటి క్లూలు కనుక్కోవద్దని బ్యాంక్‌లో కారం చల్లారు.

దీనిపై న్యామతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ ప్రశాంత్ (ఐపీఎస్), చన్నగరి ఎన్సీపీ సామ్ వర్గీస్(ఐపీఎస్) ఈ దర్యాప్తుకు నాయకత్వం వహించారు. ముందుగా, పోలీసులు 8 కి.మీ రేడియస్‌లో సోదాలు జరిపారు. 50 కి.మీ పరిధిలోని సీసీటీవీ ఫుటేజీని చూశారు. మొబైల్ టవర్ డంప్ టెక్నాలజీ, అంతర్రాష్ట్ర టోట్ డేటాను విశ్లేషించారు.

గతంలో బ్యాంక్ దొంగతనాలకు సంబంధించిన కేసుల్ని పరిశీలించారు. వీటిలో ఒకటి భద్రావతిలోని హోలెహోన్నూర్‌లో జరిగిన ఎస్‌బీఐ బ్యాంక్ దోపిడీ ప్రయత్నం కూడా ఉంది. సాంకేతిక ఆధారాల ద్వారా ఇలాంటి నేరాలు చేసే అత్యంత ప్రమాదకరమైన ఉత్తర్ ప్రదేశ్ బదాయిన్‌కి చెందిన కక్రాల ముఠాని విచారించారు. నవంబర్ 2024 మరియు ఫిబ్రవరి 2025 మధ్య యూపీ, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్‌లో హై రిస్క్ ఆపరేషన్లు నిర్వహించారు. చివరకు ఐదుగురు సభ్యులు ఉన్న గుడ్డు కాలియా, అస్లాం అలియాస్ తంతున్, హజరత్ అలీ, కమ్రుద్దీన్ అలియాస్ సరైల్లీ బాబు, బాబు సహాన్‌లను అరెస్టు చేశారు. అయితే, వీరికి గతంలో కర్ణాటకలో దోపిడీ చరిత్ర ఉంది. న్యామతి ఎస్‌బీఐ దొంగతనంలో వీరికి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో మళ్లీ దర్యాప్తు మొదటి నుంచి ప్రారంభమైంది.

తర్వాతి విచారణలో పోలీసులు తమిళనాడుకు చెందిన అనుమానితులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. నిఘా సమాచారం ఆధారంగా, బ్యాంక్‌ని దోపిడీ చేసిన నిజమై దొంగలు అజయ్‌కుమార్, అభిషేక, చంద్రు, మంజునాథ్, పరమానందలను అరెస్టు చేశారు.

‘‘మనీ హీస్ట్’’ చూసి దోపిడీ..

మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ప్రేరణగా తీసుకుని నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. విజయ్‌కుమార్, అజయ్‌కుమార్, వారి బావమరిది పరమానంద, తమిళనాడుకు చెందినవారు, కొన్ని సంవత్సరాలుగా న్యామతిలో స్వీట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులు స్థానికులు. ఈ దోపిడీకి విజయ్ కుమార్ కీలక సూత్రధారి. మనీ హీస్ట్ చూసి ఆరు నెలల నుంచి ప్లాన్ రెడీ చేసుకున్నాడు.

2023లో రూ. 15 లక్షల లోన్‌ని తిరస్కరించడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న విజయ్, దోపిడీకి ప్రణాళిక రచించాడు. రాత్రిపూట బ్యాంక్ వద్ద రెక్కీ నిర్వహించాడు. శబ్ధం లేకుండా పనిచేసే హైడ్రాలిక్ కట్టర్లు, గ్యాస్ కటింగ్ పరికరాలను సేకరించారు. వీటి సాయంతో బ్యాంక్‌ని కొల్లగొట్టారు. చివరకు పోలీసులు తమిళనాడు మధురై లోని ఉసలంపట్టి పట్టణానికి చేరుకున్నారు. 30 అడుగుల బావిలో దాచి ఉంచిన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని తాకట్టు పెట్టిన షాపుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.