NTV Telugu Site icon

Kargil Vijay Diwas: ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్.. కార్గిల్ వీరులకు నేతల నివాళి

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశవ్యాప్తంగా కార్గిల్ వీరులకు నివాళులు అర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్ధం ద్వారా ధీటైన జవాబు చెప్పింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ పై 1999లో కార్గిల్ యుద్ధంలో గెలుపొందిన సందర్భంగా ప్రతీ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ విజయ్ దివాస్ సాయుధ బలగాల అసాధారణ పరాక్రమానికి, సంకల్పానికి ప్రతీక అని.. భారతమాతను రక్షించేందుకు ప్రాణాలర్పించిన వీర సైనికులకు నమస్కరిస్తున్నానని.. దేశ ప్రజలందరూ వాళ్లకు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ రుణ పడి ఉంటారని.. జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. ‘‘కార్గిల్ విజయ్ దివస్ భారత మాత యొక్క గర్వం, కీర్తికి చిహ్నం. మాతృభూమి రక్షణలో తమ పరాక్రమాణ్ని చూపించిన దేశ వీరు పుత్రులందరికీ నా వందనం. జైహింద్’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు.

Read Also: Heavy floods: గండిపేట జలాశయానికి భారీ వరద.. మూసీ పరివాహక ప్రాంతాలపై అలర్ట్‌

1999 మే నెలలో దొంగచాటున పాకిస్తాన్ ఆర్మీ భారత్ లోని కార్గిల్ ప్రాంతంలో పలు కీలకమైన శిఖరాలను ఆక్రమించుకుంది. గొర్రెల కాపరులు ఈ విషయాన్ని సైన్యానికి చేరవేశారు. అయితే పెట్రోలింగ్ కోసం వెళ్లిన ఐదుగురు భారత జవాన్లను పాక్ ఆర్మీ చంపేసింది. దీంతో భారత ఆర్మీ ‘ ఆపరేషన్ విజయ్’ ప్రారంభించింది. పాకిస్తాన్ చేతుల్లో ఉన్న కీలక శిఖరాలను స్వాధీనం చేసుకుంటూ వెళ్లింది. అయితే పాక్ ఆర్మీ వ్యూహాత్మకంగా ఎతైన ప్రాంతాల్లో ఉండటం వల్ల మొదట్లో పాకిస్తాన్ పై చేయి సాధించింది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్ 21, మిగ్ 27, మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో దాడులు ప్రారంభించంతో పాక్ ఆర్మీపై పై చేయి సాధించే అవకాశం లభించింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ ఆధ్వర్యంలోనే ఈ దాడికి రూపకల్పన జరిగింది. అయితే భారత దళాల పరాక్రమంతో పాకిస్తాన్ వెనుదిరిగింది. జూలై 25న ఆపరేషన్ విజయ్ విజయవంతం అయిందని అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రకటించారు. కార్గిల్ విజయానికి గుర్తుగా ప్రతీ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నారు. ఈ యుద్ధంలో దాదాపుగా 500 మంది భారత సైనికులు చనిపోగా.. 4000 వరకు పాక్ సైనికులను మట్టుపెట్టాం.