Site icon NTV Telugu

INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌పై జేడీయూ నేత ఆరోపణలు..

India

India

INDIA bloc: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, డీఎంకే, టీఎంసీ, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) వంటి పార్టీలు కూటమిలో కీలకంగా ఉన్నాయి. అయితే గతేడాది కూటమి ఏర్పడినప్పటికీ.. ఇప్పటికీ సీట్ల షేరింగ్‌పై కసరత్తు పూర్తి కాలేదు. కూటమికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు సమావేశాలు జరిగాయి. అయినా సీట్లపై కసరత్తు కొలిక్కిరాలేదు.

అయితే, ఈ వ్యవహారంపై కూటమిలో కీలక పార్టీగా ఉన్న సీఎం నితీష్ కుమార్ జేడీయూ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకంపై 3 నెలలుగా ఆలస్యం అవుతోందని జేడీయూ నేత తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం పరిచారు. దీంతో ఎన్నికల ముందే కూటమిలో అసమ్మతి కనిపించడం ప్రారంభమైంది. మరోవైపు ఇండియా కూటమి కన్వీనర్‌గా సీఎం నితీష్ కుమార్‌ని నియమిస్తారనే వార్తలు వస్తున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత లేదు.

Read Also: Jeffrey Epstein Files: ఎప్‌స్టీన్ ద్వీపానికి వెళ్లొచ్చిన రెండేళ్లకే టాప్ మోడల్ ఆత్మహత్య..

జనతాదళ్ యునైటెడ్ (జెడియు) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు బీహార్ ప్రభుత్వంలో మంత్రి సంజయ్ కుమార్ ఝా శుక్రవారం మాట్లాడుతూ సీట్ల పంపకాల చర్చలు ఇప్పటికే మూడు నెలలకు పైగా ఆలస్యం అయిందని పేర్కొన్నారు. 2023లో గాంధీ జయంతి రోజున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు వీలుగా భారత కూటమి సభ్యుల మధ్య సీట్ల పంపకంపై ముందస్తు ఒప్పందాన్ని నితీష్ కుమార్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ ఆలస్యానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిమగ్నమై ఉండటమే అని అన్నారు. నెలాఖరులో సీట్ల షేరింగ్‌పై ఒప్పందం కుదురుతుందని ఆయన అన్నారు. మేము వేగంగా వ్యవహరిస్తే ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.

Exit mobile version