Prajwal Revanna sex scandal: సెక్స్ కుంభకోణంలో ఇరుకున్న జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పార్టీ నుంచి బహిష్కరించాలనే వాదన పెరుగుతోంది. దీంతో ఆయనను జేడీఎస్ బహిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు కర్ణాటకలోని హుబ్బళ్లిలో జేడీఎస్ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో పోలింగ్‌లో హసన్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ ఉన్నారు. ఎన్నికల వేళ ఈ ఆరోపణలు కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమికి దెబ్బగా మారే అవకాశం ఉండటంతో ప్రజ్వల్ బహిష్కరణ దాదాపుగా ఖరారైనట్లే అని తెలుస్తోంది.
నిన్న ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి వందలాది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక వీడియోలు వెలువడ్డాయి. ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకైన హెచ్‌డీ రేవణ్ణ కూడా లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్నాడు. రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ వీరిద్దరిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై ఇప్పటికే కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేసు రేవణ్ణ కుటుంబానికి సంబంధించిన విషయమని, దీంట్లో నాపేరు, తన తండ్రి దేవెగౌడ పేరును ఎందుకు తీసుకువస్తున్నారని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. ఒకవేళ నేరం రుజువైతే ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని అన్నారు.