Javed Akhtar: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ హిందువులపై ప్రశంసలు కురిపించారు. హిందూ సమాజం సహనంతో ఉందని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల కారణంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందని ఆయన గురువారం అన్నారు. సమాజంలో అసహనం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
హిందువులు ఉదారంగా, విశాల హృదయంతో ఉంటారని అన్నారు. కొంతమంది ఎప్పుడూ అసహనంతో ఉంటారని, హిందువులు అలా ఉండరని అది వారి గొప్ప గుణం అని అన్నారు. ‘వారికి గొప్ప గుణం, ఉదార, విశాల హృదయం ఉందని వాటిని కోల్పోకండి, లేకపోతే మీరు ఇతరులలా అవుతారు’ అని చెప్పారు.
Read Also: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులపై స్పందించిన కెనడా..
భారతీయ ముస్లిం సమాజంలో అభ్యుదయ, ఉదారవాద వ్యక్తుల్లో జావేద్ అక్తర్ ఒకరిగా పరిగణించబడుతున్నారు. ముంబైలో రాజ్ ఠాక్రేకి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ కార్యకక్రమంలో జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ‘మేము హిందువుల జీవన విధానం నుంచి నేర్చుకున్నాము.. మీరు దాన్ని వదిలేస్తారా..?’ అని ప్రశ్నించారు.
రాముడు, సీతాదేవి జన్మించిన ఈ భూమిలో జన్మించినందుకు మేం గర్వపడుతున్నామని, తాను నాస్తికుడిని అయితే, రాముడు, సీతదేవిని ఈ దేశ సంపదగా భావిస్తున్నానని అన్నారు. రామాయణం మన సాంస్కృతిక వారసత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘జై సియారాం’ అని నినదించారు. భావ ప్రకటన స్వేచ్ఛ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘షోలే’ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు సినిమా తీస్తే హేమామాలిని, ధర్మేంద్ర గుడిలో డైలాగ్స్‌పై పెద్ద వివాదం వచ్చేదని అన్నారు. హిందూ సంస్కృతి, నాగరికత మనకు ప్రజాస్వామ్య వైఖరిని నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. మనమే కరెక్ట్, ఇతరులు తప్పు అని హిందువులు భావించరని ఆయన అన్నారు.