Delhi Protest : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ డిమాండ్లతో ఆందోళన చేపడుతున్న నిరసనకారులు, యువతకు , పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించింది. నెట్ సేవలను హఠాత్తుగా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు పోలీసులను గట్టిగా నిలదీశారు. క్రమంగా పరిస్థితులు చేయిదాటిపోవడంతో అక్కడ తీవ్ర స్థాయి ఉద్రిక్తత నెలకొంది.
నిరసనకారులు ఒక్కసారిగా ఆగ్రహంతో పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో జంతర్ మంతర్ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి , నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ముందస్తు జాగ్రత్త చర్యగా జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ, యువత నిరసనలు కొనసాగించడంతో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది.

