జమ్మూను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జమ్మూ అతలాకుతలం అయింది. భారీ వర్షం కారణంగా కథువా, సాంబా, రియాసి, ఉధంపూర్ సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో 100 సంవత్సరాల్లో ఆగస్టులో రెండో అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్మూ నగరంలో 190.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఆగస్టు 5న 1926న జమ్మూలో 228.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ రికార్డ్‌ను గతంలో ఆగస్టు 11, 2022న బద్దలు కొట్టింది. అప్పుడు 189.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఇదే ఆగస్టులో 190.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలు కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రజా రవాణా పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Rekha Gupta: రేఖా గుప్తా దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్.. ఇతడేం చేశాడంటే..!
ఇక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తం కావాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని.. బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇక జమ్మూలో చిక్కుకున్న 45 మంది విద్యార్థులను దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో రహదారులు మూసివేశారు. ఇక విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది.
ఇది కూడా చదవండి: Warangal: వరంగల్ లో దారుణం.. నాలుగు నెలల క్రితమే పెళ్లి.. భార్యపై దారుణం
జమ్మూ నగరంలో ప్రధాన రోడ్లన్నీ నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జానిపూర్, రూప్ నగర్, తలాబ్ టిల్లో, జ్యువెల్ చౌక్, న్యూ ప్లాట్, సంజయ్ నగర్ వంటి ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. ఇళ్ల సరిహద్దు గోడలు కూలిపోయాయి. దాదాపు డజను వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయని తెలుస్తోంది. తావి వంతెన సమీపంలో రోడ్డులో కొంత భాగం కుంగిపోయింది. జమ్మూ బస్టాండ్ దగ్గర ఎగ్జిట్ గేట్ కల్వర్ట్ కూలిపోయింది. వరద నీరు గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించడంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ హాస్టల్ నుంచి 45 మంది విద్యార్థులను రెస్క్యూ బృందాలు కాపాడాయి. ఇక మంగళవారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
