Site icon NTV Telugu

EC: జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం? త్వరలోనే ఈసీ నోటిఫికేషన్!

Ec

Ec

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ఎన్నికల బృందం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించింది. సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్.సంధు నేతృత్వంలోని ఎన్నికల బృందం శ్రీనగర్‌లో పర్యటించింది. శ్రీనగర్‌లో అధికారులతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటే జమ్మూకాశ్మీర్ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలం నుంచి జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరగడం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. అంతేకాకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు.. సెప్టెంబర్‌లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్నికల సంఘంలో కదిలిక వచ్చింది. గురువారం శ్రీనగర్‌లో పర్యటించి.. పరిస్థితుల్ని సమీక్షించారు. 20 జిల్లాల సీనియర్ పోలీసు అధికారులను, రాజకీయ పార్టీలతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌ఎస్ పఠానియా పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తిరిగి ఎన్నికలు జరగలేదు. చాలా గ్యాప్ వచ్చేసింది. జూన్ 2018 నుంచి కేంద్ర పాలనలో ఉంది. ఆర్టికల్ 370 ప్రకారం దాని ప్రత్యేక హోదా కూడా ఆగస్టు 2019లో రద్దు చేయబడింది. దీనిని జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్‌గా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటి వరకు ఎన్నికల సంఘం మూడు సార్లు పర్యటించింది. అంతకుముందు 2019, 2024లో కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా సన్నాహాలు చేశారు. కానీ ఎన్నికలు మాత్రం జరగలేదు. అయితే ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. గత నెలలో శ్రీనగర్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, దాని రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తానని ప్రకటించారు.

 

Exit mobile version