Central Govt key announcement in Parliament on Jamili election: కేంద్రం జమిలి ఎన్నిలకు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది. అలాగే అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించామని కేంద్రం వెల్లడించింది. అయితే ఈ జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని.. ప్రస్తుతం ఇవి లా కమిషన్ పరిశీలిస్తుందని.. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. వేరువేరుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతోందని..ఈ ఎనిమిదేళ్లలో రూ.7 వేల కోట్లు ఎన్నికల కోెసం ఖర్చు చేశామని కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది.
ఎన్నికల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారుతున్న తరుణంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ కు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజధనాన్ని ఆదా చేసే అవకాశం ఉందని బీజేపీ సర్కార్ భావిస్తోంది. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. ‘‘ వన్ నేషన్- వన్ ఎలక్షన్’’లో భాగంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీయే సర్కార్ కొత్త విధానాన్ని తీసుకురావాలని అనుకుంటుంది.
Read Also: Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. మూడుకు చేరిన కేసుల సంఖ్య
స్వతంత్ర భారతదేశంలో 1952 నుంచి 1967 కాలం మధ్యలో నాలుగు సార్లు పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు జరిగాయి. 1952, 1957, 1962,1967 సార్లు జమిలి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత పలు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం వంటి కారణాల వల్ల జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది. ఏ రాష్ట్రంలో ఐదేళ్ల పదవీ కాలపరిమితి ముగిస్తే ఆ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం లా కమిషన్ జమిలి ఎన్నికలపై అధ్యయనం చేస్తుంది. ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంలో ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణకు దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఇది సాధ్యం అయ్యే అవకాశాలే ఎక్కువ.