కర్నాటకలో మరోసారి ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. ఇటీవల కాలంలో కర్నాటకలో వరసగా మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఓ వైపు దేశంలో జ్ఞాన్వాపి మసీదు వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర షాహీ ఈద్గా మసీదు విషయం కూడా ప్రస్తుత కోర్టు లో ఉంది. ఇలాంటి వివాదాల మధ్య కర్నాటకలో ఇలాంటి వివాదాలే తెరపైకి వస్తున్నాయి.
కర్నాటక మాండ్యా జిల్లా శ్రీరంగ పట్నంలోని జామియా మసీదు ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. కొన్ని హిందూ సంస్థలు శనివారం ‘ ఛలో జామియా మసీద్’కు పిలుపునిచ్చాయి. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 144ను అమలు చేసింది. గతంలో జామియా మసీదు హనుమాన్ దేవాలయం అని వీహెచ్పీ వంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ రోజు మసీదులో పూజలు నిర్వహించడానికి హిందూ సంస్థలు సిద్ధమవుతున్న తరుణంలో మాండ్యాలో జిల్లాలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పట్టణంలో 500 మంది పోలీసులు మోహరించారు. సీసీ కెమరాలతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మసీదుకు వెళ్లే అన్ని దార్లను మూసేశారు.
జామియా మసీదును టిప్పు సుల్తాన్ హయాంలో కూల్చివేసినట్లు ఆధారాలు ఉన్నట్లు హిందూ సంఘాలు అంటున్నాయి. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే కర్నాటక మంగళూర్ శివారులోని జుమా మసీదు కూడా ఒకప్పుడు దేవాలయమే అని హిందు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మసీదు మరమ్మత్తుల్లో భాగంగా దేవాాలయానికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ మసీదు కూడా వివాదాస్పదం అవుతోంది.