NTV Telugu Site icon

Jama Masjid: జామామసీద్‌లోకి మహిళల ప్రవేశంపై నిషేధం.. మహిళా కమిషన్ నోటీసులు

Jama Masjid

Jama Masjid

Jama Masjid bans entry of women who come without men: దేశంలోని సుప్రసిద్ధ ఢిల్లీలోని జామా మసీదు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. మహిళలు, బాలికలు మసీదులోకి రాకుండా వారి ప్రవేశంపై నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. మసీదు నిర్వాహకులు బాలికలు, మహిళలు ఒంటరిగా కానీ గుంపుగా కానీ మసీదులోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ గేట్లపై నోటీసులు అంటించారు. మసీదుకు రావాలంటే వారి కుటుంబంలోని పురుషుడు తప్పని సరి అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం వివాదంగా మారింది. అయితే దీన్ని పరిష్కరించేందుకు జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ రంగంలోకి దిగారు. ఈ నోటీసులు అంటించడానికి కారణాలు వివరించారు.

ఇది ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని.. పవిత్ర మసీదు ఆవరణలో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. జామా మసీదు ఓ ప్రార్థన స్థలం, దీన్ని ప్రజలంతా స్వాగతిస్తారు. మసీదు కేవలం ప్రార్థనలు చేసుకునేందుకు మాత్రమే ఉంది. నిజంగా ప్రార్థనలు చేసేందుకు వచ్చే వారికి ఎలాంటి అభ్యంతరం పెట్టమని.. అయితే కొంతమంది అమ్మాయిలు, మహిళలు ఒంటరిగా వచ్చి వేరే వారి కోసం ఎదురుచూస్తున్నారని.. ఇది అందుకు ఉద్ధేశించింది కాదని ఆయన అన్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్

మసీదు, దేవాలయం, గురుద్వారా ఏదైనా ప్రార్థన స్థలం నిజంగా ప్రార్థనల కోసం వచ్చే మహిళలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు బుఖారీ. ఈ రోజు కూడా 20-25 మంది అమ్మాయిల బృందం వచ్చిందని వారి ప్రవేశానికి అనుమతించామని ఆయన అన్నారు. జామా మసీదు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబివుల్లా ఖాన్ ఈ చర్యను సమర్థించారు, నమాజ్ చేయడానికి వచ్చే వ్యక్తులకు భంగం కలిగించే విధంగా మహిళలు సోషల్ మీడియా కోసం వీడియోలు షూట్ చేయడాన్ని నిరోధించడానికి నిషేధం అని అన్నారు. కుటుంబం, భర్తతో వచ్చే మహిళలపై ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు.

ఈ విషయంపై ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు. ఇది మహిళల హక్కులను ఉల్లంఘించడమే అని ఆమె అన్నారు. దీనిపై నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడం తప్పు. ఇక పురుషుడు ప్రార్థన చేయడానికి ఎన్ని హక్కులు ఉంటాయో.. మహిళలకు కూడా అవే హక్కులు ఉంటాయని ఆమె అన్నారు. ప్రవేశాన్ని నిషేధించే హక్కు ఎవరికీ లేదని ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 17వ శతాబ్ధంలో మొఘటల్ శకం స్మారక చిహ్నంగా జామా మసీదు ఉంది. దీన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు.