Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు

  • యువత ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం
  • విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగుతుంది
  • జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
Jairamramesh

Jairamramesh

నీట్ (NEET) పరీక్ష వివాదంపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం వెనుక ‘డీప్ స్టేట్’ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ.. అది యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబమని భావించే వారు కూడా ఉన్నారని జైరాం రమేష్ అన్నారు.

ఒక ఇంటర్వ్యూలో జైరాం రమేష్ మాట్లాడుతూ.. కాక్రోచ్ ఉద్యమం ఎలా ప్రారంభమైందనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. ‘‘కొంతమంది ఇది డీప్ స్టేట్ ప్రాయోజిత ఉద్యమమని అంటున్నారు. మరికొందరు యువతలో ఉన్న నిరాశ, ఆగ్రహానికి ఇది ప్రతిబింబమని చెబుతున్నారు. ఈ రెండు వాదనల్లో ఏది నిజమో నిరూపించడం కష్టం. కానీ ఈ ఉద్యమం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది’’ అని వ్యాఖ్యానించారు.

×
×
Ad

అయితే కాక్రోచ్ ఒక రాజకీయ పార్టీ కాదని.. ప్రజాస్వామ్యంలో చివరకు రాజకీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. ‘‘యువత అసంతృప్తిని దేశానికి తెలియజేయడంలో ఈ ఉద్యమం ఒక వేదికగా పనిచేసింది. కానీ ఆ సమస్యలను ముందుకు తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపాల్సింది స్థిరమైన రాజకీయ పార్టీలే’’ అని అన్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విద్యార్థులతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోటాలో విద్యార్థులతో సమావేశమైన రాహుల్ గాంధీ.. త్వరలో ప్రయాగ్‌రాజ్, పాట్నా, ఢిల్లీ నగరాల్లో కూడా విద్యార్థులతో చర్చలు జరపనున్నారు. ‘‘రాహుల్ గాంధీ కేవలం NEET లేదా CBSE పరీక్షల అంశాన్నే లేవనెత్తడం లేదు. దేశ విద్యా వ్యవస్థ, పరీక్షల విధానం, విద్యపై ప్రభుత్వ పెట్టుబడులు వంటి మౌలిక అంశాలపై చర్చను ముందుకు తీసుకెళ్తున్నారు’’ అని జైరాం రమేష్ పేర్కొన్నారు. అలాగే కోటాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘భారత కుటుంబాలు కోచింగ్ సెంటర్లపై ఖర్చు చేస్తున్న డబ్బు కంటే కేంద్ర ప్రభుత్వం విద్యపై తక్కువగా ఖర్చు చేస్తోంది’’ అని చెప్పారని గుర్తు చేశారు. దీనిని విద్యా వ్యవస్థలో ఉన్న మౌలిక అసమతుల్యతగా జైరాం రమేష్ అభివర్ణించారు.